ముంబై, జూలై 1: బీజేపీ పాలిత మహారాష్ట్రలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ప్రశ్న పత్రం ఎక్కడ ముద్రించారో సాక్షాత్తు రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి కూడా తెలియదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సుధీర్ ముంగంటి వార్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా విద్యా శాఖ మంత్రే అంగీకరించారని ఆయన చెప్పారు. ‘టెట్ ప్రశ్న పత్రాలు ఆగ్రాలో ముద్రిస్తున్న విషయం తనకు తెలియదని విద్యా శాఖ మంత్రి దాదాజీ భూసే నాతో వ్యక్తిగతంగా చెప్పారు. అధికారులు ఎప్పుడూ ఆ వివరాలు చెప్పలేదని ఆయన అంగీకరించారు’ అని ముంగంటి వెల్లడించారు.
కాగా, జూన్ 28న జరుగాల్సిన టెట్.. ప్రశ్న పత్రం లీక్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలు, అభ్యర్థులు బీజేపీ ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ పార్టీలను చీల్చడంలో చూపే శ్రద్ధను పరీక్షల నిర్వహణలో చూపితే బాగుంటుందని ఆరోపించారు. కాగా, ఇదే అంశంపై ఇటీవల అసెంబ్లీలో చర్చ జరగ్గా, బీజేపీ నేత ముంగంటి వార్ కూడా సొంత ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపించారు. ప్రశ్న పత్రం లీకేజీలో శివసేన నేత దాదాజీ భూసే మంత్రిత్వ శాఖపైనా విమర్శలు చేశారు.