బెంగళూరు, ఏప్రిల్ 30 : కర్ణాటకలోని బెంగళూరులో బుధవారం సాయంత్రం కురిసిన అకాల భారీ వర్షం ఆరేండ్ల బాలిక సహా ఏడుగురిని పొట్టనబెట్టుకుంది. నగరంలో హఠాత్తుగా భారీ గాలులతో వర్షం కురిసింది. పలు చోట్ల వడగండ్ల వాన పడింది. వర్షం నుంచి ఆశ్రయం పొందడానికి బౌరింగ్ దవాఖాన ప్రహరీ పక్కకు చేరిన వారిపై అది కూలిపోవడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వీధి వ్యాపారులే.
ఘటనా స్థలిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సందర్శించి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. జరిగిన ఘటనపై నిర్లక్ష్య కోణం ఏదైనా ఉందా అన్న విషయంపై దర్యాప్తు జరిపిస్తానని తెలిపారు. భారీ వర్షం కారణంగా నగరంలో వివిధ ఘటనల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, భారీ వర్షానికి చర్చి స్ట్రీట్‌లోని ఐకానిక్ బుక్వామ్ పుస్తకాల దుకాణంలోకి వరద నీరు చేరడంతో 5 వేల పుస్తకాల వరకు పాడైపోయినట్టు దుకాణ యజమాని తెలిపారు.