మాండసౌర్, నవంబర్ 12: ఉల్లిగడ్డల ధరలు ఒక్కసారిగా ఘోరంగా పడిపోవడంతో మధ్యప్రదేశ్ ఉల్లి రైతులు విలవిల్లాడుతున్నారు. తాము పండించిన ఉల్లిగడ్డను కారుచౌకగా అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, వాటితో ఆదాయం మాట దేవుడెరుగు, కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదని మాండసౌర్ జిల్లా రైతులు వాపోతున్నారు. తనకున్న భూమిలో ఆరేడు క్వింటాళ్ల ఉల్లిని పండించానని, అయితే కిలోకు 2 రూపాయల ధర కూడా రాకుండా 1.99 రూపాయలు వచ్చిందని ఒక ఉల్లి రైతు వాపోయాడు. ఇది తన రవాణా ఖర్చులకు కూడా సరిపోలేదని తెలిపాడు.
వెయ్యి రూపాయల రవాణా ఖర్చుతో స్థానిక మార్కెట్కు వచ్చిన తనకు క్వింటాల్ రూ.170 చొప్పున అమ్మితే 700 రూపాయలు వచ్చాయని మరో రైతు వాపోయాడు. ఈ ధరలు చూసి కొందరు రైతులు తాము తెచ్చిన పంటలను అమ్మడం మాని, వాటిని ఉచితంగా పంచడం ప్రారంభించారు. ఉల్లి గడ్డల పంటకు ఎకరానికి 33 వేల రూపాయల ఖర్చయిందని, అయితే దానిపై ఒక్క పైసా ఆదాయం కూడా రాలేదని, వాటిని అమ్మితే కేజీకి రూపాయి వస్తున్నదని అందుకే తాను తెచ్చిన సరుకును ఉచితంగా పంచుతున్నట్టు మరో రైతు తెలిపారు. ఉల్లి ధరలు పడిపోయినాబీజేపీ సర్కారు చోద్యం చూస్తున్నదని రైతన్నలు మండిపడుతున్నారు.