న్యూఢిల్లీ, మే 17: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా వాతావరణంలో మార్పు సంభవించింది. దుమ్ము తుఫాన్, ఈదురు గాలులతో కూడిన వర్షంతో పాటు స్వల్పంగా వడగళ్ల వాన కురిసింది. ఈదురు గాలుల కారణంగా న్యూ అశోక్ నగర్‌లోని మెట్రో షెడ్‌కు నష్టం ఏర్పడింది.
వర్షం కారణంగా సాయంత్రం సెంట్రల్ ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా,మరో ఇద్దరు గాయపడ్డారు. మరోవైపు ఉత్తర తమిళనాడులో పలు జిల్లాల్లో శనివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో శని, ఆదివారాలు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఉష్ణోగ్రతలు 1-3 డిగ్రీలు తగ్గొచ్చని వెల్లడించింది.