Tirupati Laddu Controversy | తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై విచారణ జరుపాలని కోరారు. ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానంలో పర్యవేక్షణలో ఉండే కమిటీని నియమించేందుకు ‘రిట్ ఆఫ్ మాండమస్’.. లేకపోతే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో సుప్రీంకోర్టుకు సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజారోగ్యంతో పాటు వేంకటేశ్వరస్వామి వారికి సమర్పించే నైవేద్యాలకు సంబంధిన అంశమని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం.. ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని పిటిషన్ కోరారు.
లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి మూలం, నాణ్యతతో సహా ల్యాబ్ పరీక్షలపై దృష్టి సారించి.. సంబంధిత అధికారుల నుంచి వివరణాత్మక ఫోరెన్సిక్ నివేదిక పొందేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ నేత కోరారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. అవి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం కమిటీ వేయాలని.. నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చానన్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా బీజేపీ నేత సైతం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. తిరుమలలో ఇవాళ శాంతిహోమం నిర్వహించింది. లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రత, దైవత్వాన్ని పునరుద్ధింపజేసేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావి చెంతగల యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి, శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది.