న్యూఢిల్లీ, డిసెంబర్ 7: నోట్లరద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)లను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2016, నవంబర్లో మోదీ సర్కార్ తీసుకొన్న నోట్లరద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ ముగిసింది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. రికార్డులను సీల్డ్ కవర్లో సమర్పిస్తామని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.
2016లో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది. నోట్లరద్దు వంటి ఆర్థిక నిర్ణయాలపై న్యాయసమీక్ష సాధ్యం కాదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను న్యాయస్థానం తిరస్కరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయ సమీక్షకు పరిమితులు ఉంటా యంటే.. దానర్థం న్యాయ స్థానం చేతులు ముడుచుకొని కూర్చోవాలని కాదని, ప్రభుత్వ నిర్ణయ విధానంపై కోర్టు ఎల్లప్పుడూ పరిశీలన చేయొచ్చని స్పష్టం చేసింది.