Alcohol | న్యూఢిల్లీ: మద్యపానం దుష్ప్రభావాలు తరతరాలు వెంటాడతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అతిగా మద్యం సేవిస్తే అది మనుమల జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని తెలుస్తున్నది. తాత, తండ్రి వంటి పితృ సంబంధీకులు మద్యపానానికి అలవాటు పడితే, దాని ప్రభావం వారి సంతానం ఆరోగ్యం, ప్రవర్తనలపై పడుతుందని వెల్లడైంది.
టెక్సాస్ ఏ అండ్ ఎం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మైఖేల్ గోల్డింగ్ మాట్లాడుతూ, తల్లిదండ్రులిద్దరూ అతిగా మద్యం సేవించేటట్లయితే, వారి పిల్లలు వేగంగా వృద్ధులవుతారని, వ్యాధులబారిన త్వరగా పడతారని తమ పరిశోధనలో తేలిందన్నారు. అమెరికా దేశంలోని 11 శాతం మంది యువత ఆల్కహాల్ వినియోగ రుగ్మతతో బాధపడుతున్నారు.
అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె సమస్యలు, వేగంగా వృద్ధాప్యం రావడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ ఆరోగ్య సమస్యలను తమ పిల్లలకు వారసత్వంగా అందిస్తారు. గర్భస్థ పిండాలకు ఈ రోగాలు సంక్రమించడం వల్ల టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు త్వరగా వస్తాయి.