న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో విద్యార్థుల ఆత్మహత్యల నిరోధానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు. మార్గదర్శకాల పర్యవేక్షణకు సమగ్ర వ్యవస్థ లేకపోవడమే కారణంగా కనిపిస్తున్నది.
రెండున్నరేండ్లలో ఐఐటీల్లో 40 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచార హక్కు చట్టం ద్వారా ధీరజ్ సింగ్ తెలుసుకున్నారు. ఆయన గ్లోబల్ ఐఐటీ అలుమ్ని సపోర్ట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఐఐటీ కాన్పూర్ మాజీ విద్యార్థి. విద్యార్థుల ఆత్మహత్యలకు సరైన కారణాలేమిటని అడిగితే.. వ్యక్తిగత లేదా విద్యా సంబంధిత ఒత్తిళ్లేనని అధికారులు యథాలాపంగా చెప్తున్నారని ధీరజ్ ఆవేదన వ్యక్తం చేశారు.
2021-2025 మధ్య దేశంలో 67 మంది ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.కేంద్ర విద్యా శాఖ మార్గదర్శకాలను జారీ చేసిన తర్వాత కూడా 40 మంది ఆత్మహత్య చేసుకున్నారని.. మార్గ దర్శకాలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు జవాబుదారీ అనే ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయని ఆయన తెలిపారు.