న్యూఢిల్లీ, జూన్ 29 : జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020 కింద త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సోమవారం విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వస్తాయి. కొత్త మార్గదర్శకాల కింద 10వ తరగతి విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరంలో తృతీయ భాషను చదవవలసిన అవసరం లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సడలింపులో భాగంగా ప్రస్తుతం 7వ, 8వ, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు వారు 10వ తరగతిలో ప్రవేశించినపుడు తృతీయ భాషలో సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షకు హాజరు కావలసిన అవసరం ఉండదు.
తృతీయ భాష విధానాన్ని అన్ని తరగతులలో అమలు చేయనున్నట్లు గతంలో సీబీఎస్ఈ ప్రకటించింది. వివిధ బ్యాచ్లకు ఈ విధానాన్ని ఎలా ప్రవేశపెడతారో, బదిలీ కాలంలో ఏయే మినహాయింపులు వర్త్తిస్తాయో తాజా మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం 6వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ మినహాయింపులు వర్తించవు. వారు మూడు భాషలు చదవవలసిందే. వీటిలో రెండు భారతీయ భాషలు ఉంటాయి. వారు పదవ తరగతిలోకి ప్రవేశించినపుడు మూడవ భాషలో కూడా బోర్డ్ పరీక్ష రాయకతప్పదు. వారికి ఇది 2030లో వర్తిస్తుంది. ప్రస్తుతం 7, 8, 9 తరగతులో ఉన్న విద్యార్థులు 10వ తరగతిలో మూడవ భాషలో బోర్డ్ పరీక్ష రావలసిన అవసరం ఉండదు అని సీబీఎస్ఈ పేర్కొంది.