కోల్‌కతా, ఆగస్టు 27: పశ్చిమ బెంగాల్ భగ్గుమంది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నబన్న అభిజన్’ ర్యాలీ పేరుతో పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ అనే విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పోలీసులు – నిరసనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇరువైపులా అనేకమంది గాయాలపాలయ్యారు. మరోవైపు డీఏ పెంచాలనే డిమాండ్‌తో సంగ్రామి జౌత మంచ అనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సైతం సచివాలయానికి ర్యాలీ నిర్వహించాలనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కోల్‌కతాలో ముందుజాగ్రత్తగా 4 వేల మందితో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది.
12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపు
పోలీసుల చర్యలకు నిరసనగా బుధవారం 12 గంటల పాటు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందర్ పిలుపునిచ్చారు. విద్యార్థులపై దాడులను పోలీసులు ఆపకపోతే రాష్ర్టాన్ని స్తంభింపజేస్తామని ప్రతిపక్ష నేత సువేందు అధికారి హెచ్చరించారు. నియంతలా ప్రవర్తిస్తున్న మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా డిమాండ్ చేశారు. హత్యాచార ఘటనలో ప్రమేయం ఉన్న వారిని మమతా బెనర్జీ కాపాడుతున్నారని, ఆమెకు, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష చేస్తే నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
పోలీసుల లాఠీచార్జి..రాళ్లు రువ్విన నిరసనకారులు
సచివాలయానికి వెళ్లేందుకు మంగళవారం ఉదయం విద్యార్థులు, ఉద్యోగులు వేర్వేరుగా ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటుచేసి వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో హౌరా బ్రిడ్జి వద్ద, సంత్రగచ్చి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు – నిరసనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి, జలఫిరంగులు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లురువ్వారు. తర్వాత ఎంజీ రోడ్డు, హస్టింగ్స్ రోడ్డులోనూ ఘర్షణలు తలెత్తాయి. ఇరువైపులా అనేక మంది గాయపడ్డారు. ఘర్షణలతో రోజంతా కోల్‌కతాలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.