చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి నుంచి డిగ్రీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించటం ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళనాడుకు, తమిళ భాషకు ఏం చేశారంటూ ఎంబీఏ విద్యార్థిని జీన్ రాజన్ ప్రశ్నించారు. ‘రాష్ట్రం పట్ల ఆయన చర్యలు ఆందోళన కలిగించేవే కాదు, నన్ను తీవ్రంగా బాధించాయి. అందువల్లే ఆయన చేతుల మీదుగా డిగ్రీ పట్టా తీసుకోరాదని నిర్ణయించుకున్నా’ అని జీన్ రాజన్ అన్నారు.
ఈ ఉదంతంపై తమిళనాడు బీజేపీ ఘాటుగా స్పందించింది. సొంతపార్టీలో ఫేమ్ దక్కించుకునేందుకు డీఎంకే కార్యకర్తలు ఆడుతున్న రాజకీయ డ్రామాలు ఆపాలని పేర్కొన్నది. బుధవారం తిరునల్వేలిలో జరిగిన మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి చాన్సలర్ హోదాలో గవర్నర్ ఆర్ఎన్ రవి హాజరుకాగా, విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. అయితే నాగర్‌కోయిల్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థిని జీన్ రాజన్ గవర్నర్ ఆర్ఎన్ రవి నుంచి డిగ్రీ పట్టాను అందుకునేందుకు నిరాకరించి.. వర్సిటీ వీసీ నుంచి స్వీకరించారు.