Student Visa | న్యూఢిల్లీ, మార్చి 23: భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత వలసదారులపై కక్ష గట్టినప్పటికీ విద్యార్థి వీసాలు తగ్గడానికి మాత్రం ఆయన కారణం కాదని తెలుస్తున్నది. అమెరికా ప్రభుత్వం మొత్తంగానే విద్యార్థి వీసాలను తగ్గించగా, ఈ క్రమంలోనే భారతీయ విద్యార్థుల అవకాశాలు కూడా తగ్గిపోయాయి. 2018లో 42 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు (ఎఫ్-1) లభించగా, ఆ సంఖ్య 2024 నాటికి 86 వేలకు పెరిగింది. కానీ అంతకుముందు సంవత్సరాలు 2023లో 1.31 లక్షల మందికి, 2022లో 1.15 లక్షల మందికి విద్యార్థి వీసాలు లభించాయి.
గత పదేండ్లుగా విద్యార్థి వీసాల మంజూరులో ఆమోదం తక్కువ, తిరస్కరణ ఎక్కువ అన్న చందంగా సాగుతున్నది. 2014లో దాదాపు 6 లక్షల వీసాలు మంజూరు చేసిన అధికారులు 1.73 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు. 2023లో 4.45 లక్షల దరఖాస్తులు ఆమోదం పొందగా, 2.53 లక్షలు తిరస్కరణకు గురయ్యాయి. ఎఫ్-1 వీసాల దరఖాస్తుల తిరస్కరణ 41 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024లో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి వీసాలు పొందిన దేశంగా భారత్ నిలిచింది. కానీ 2018, 2023 మధ్య ఎఫ్-1 వీసాలు మంజూరు రేటు 65.03 శాతం నుంచి 63.74 శాతానికి పడిపోయింది. ఇక భారతీయుల దరఖాస్తుల తిరస్కరణ రేటు 34.97 శాతం నుంచి 36.26 శాతానికి పెరిగింది.
ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఎంపిక చేసుకునే అగ్రశ్రేణి దేశాలు కూడా తమ విధానాలను కఠినతరం చేశాయి. అటువంటి తరుణంలో అమెరికా స్టూడెంట్ వీసా తిరస్కరణలు పెరిగాయి. కెనడా 2023తో పోల్చినపుడు 2024లో స్టూడెంట్ పర్మిట్స్ను 35 శాతానికి పరిమితం చేసింది. అదేవిధంగా బ్రిటన్ నిరుడు నిబంధనలను కట్టుదిట్టం చేసి, భారతీయ విద్యార్థులు తమపై ఆధారపడినవారిని బ్రిటన్కు తీసుకురావడంపై ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా కూడా స్టడీ వీసాలను 2023 అక్టోబరు నుంచి 2024 ఆగస్టు వరకు 38 శాతం తగ్గించింది.
కీస్టోన్ ఎడ్యుకేషన్ గ్రూప్ 2024 నవంబరులో నిర్వహించిన సర్వే ప్రకారం, ట్రంప్ విధానాలు, రాజకీయ సిద్ధాంతాల వల్ల విదేశీ విద్యార్థులకు అమెరికా తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది. వివిధ దేశాల విద్యార్థుల్లో 42 శాతం మంది అమెరికాలో చదవడం గురించి పరిశీలించడానికి ఇష్టపడలేదు.