జైపూర్, జనవరి 12: బీజీపీ పాలిత రాజస్థాన్లో దారుణం జరిగింది. బికనీర్ జిల్లాలో ఓ 12వ తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కదులుతున్న కారులో ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నానాసర్ ప్రాంతంలో ఈ నెల 6న ఈ దారుణం జరిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు వారు చెప్పారు. ఈ నెల 6న ఉదయం ఇంటి నుంచి స్కూలుకు బయల్దేరిన బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు. కదులుతున్న కారులోనే ఒకరి తర్వాత మరొకరు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
అరిస్తే చంపేస్తామని నిందితులు ఆ బాలికను బెదిరించినట్లు పోలీసులు చెప్పారు. కారు వేరే గ్రామంలోకి ప్రవేశించడంతో అనుమానంతో గ్రామస్తులు కారును అడ్డుకున్నారు. బాలికను కారులో నుంచి తోసేసి నిందితులు అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఆ బాలిక కుటుంబానికి గ్రామస్తులు సమాచారం అందచేయగా కుటుంబ సభ్యులు వచ్చి ఆ బాలికను తమ వెంట తీసుకెళ్లారు. బాలికకు 18 ఏండ్లు దాటాయని, నిందితుల వయసుపై ఇంకా స్పష్టతరాలేదని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని వారు చెప్పారు.