కోల్‌కతా, జూలై 12: కోల్‌కతాలో ఇటీవల న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన మరువక ముందే మరో లైంగిక దాడి జరిగినట్టు ఫిర్యాదు వచ్చింది. ఐఐఎం-కోల్‌కతాలో చదువుకుంటున్న ఓ విద్యార్థినిపై అక్కడి బాలుర హాస్టల్లో ఓ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం ఈ దారుణం జరుగగా, నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కౌన్సెలింగ్ కోసం తనను హాస్టల్‌కు పిలిపించారని, అక్కడ డ్రగ్స్ కలిపిన పానీయం తాగి తాను స్పృహ కోల్పోయానని విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పృహ వచ్చిన తర్వాత తాను రేప్‌నకు గురైనట్లు గుర్తించానని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది.
అలాంటిదేమీ జరగలేదు: బాధితురాలి తండ్రి
తన కుమార్తెపై రేప్ లాంటిదేదీ జరగలేదని, ఆటోరిక్షాలో నుంచి ఆమె పడిపోయిందని బాధితురాలి తండ్రి వెల్లడించారు. తన కుమార్తె ఆటోలో నుంచి పడిపోయి స్పృహ తప్పిందని శుక్రవారం రాత్రి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఆయన తెలిపారు. పోలీసులే తన కుమార్తెను కాపాడి దవాఖానలో చేర్చారని చెప్పారని ఆయన తెలిపారు. తనపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తన కమార్తె తనకు చెప్పిందన్నారు.‘వైద్య పరీక్షల సందర్భంగా పోలీసులు ఏదో చెప్పాలని నా కూతురిపై ఒత్తిడి చేశారు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. ఫిర్యాదులో భాగంగా ఏదో రాయమని పోలీసులు చెప్పారు, ఆమె అదే రాసింది’ అంటూ బాధితురాలి తండ్రి స్పష్టం చేశారు.