ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తయిన శివాజీ విగ్రహం (Shivaji Statue) ఈ నెల 26న కుప్పకూలింది. ఈ కేసులో నిర్మాణ సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే విగ్రహం శిల్పిపై హత్యాయత్నం కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, విగ్రహం కూలిపోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతున్నది. ఘటనపై విపక్ష మహావికాస్ అఘాడీ తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నది. సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీ చేపడతామని ప్రకటించింది.
ఈ ఘటనపై ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. శివాజీ మనందరి ఆరాధ్య దైవం అని, ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. గతేడాది నేవీ డే సందర్భంగా మాల్వాన్‌లోని రాజ్‌కోట కోటలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆ విగ్రహం కూలిన ఘటన ఆయన్ను అభిమానించేవారిని చాలా బాధించిందన్నారు.
నేవీ డే సందర్భంగా గతేడాది డిసెంబర్ 4న మరాఠా యోధుడు శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కోటలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. విగ్రహం కూలిన ఘటనపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యత లోపం కారణంగానే విగ్రహం కూలిపోయిందిన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విగ్రహ నిర్మాణంలోనే పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించాయి.