ఉల్హాస్నగర్: మహారాష్ట్రలో ఇద్దరు తండ్రీకొడుకులు ఓ మూగజీవిపట్ల విచక్షణారహితంగా ప్రవర్తించారు. తమ ఇంటిపరిసరాల్లో మలవిసర్జన చేసిందని ఓ వీధికుక్కను కట్టెతో కొట్టిచంపారు. తండ్రీకొడుకులు కుక్కను కొడుతుండగా చుట్టుపక్కలవారు వీడియో తీసి, సోషల్‌మీడియాలో పెట్టారు. ఈ వీడియో వైరల్‌కాగా, జంతుప్రేమికులు ఆ తండ్రీకొడుకులపై కేసు పెట్టారు.
ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో జరిగింది. ఓ వీధికుక్క ఓ ఇంటి పరిసరాల్లో మల విసర్జన చేసింది. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని కుక్కను కట్టెతో కొట్టాడు. మరుసటిరోజు అతడి కొడుకు ఆ కుక్కను చితకబాదాడు. దీంతో అది మృతిచెందింది. ఇరుగుపొరుగువారు ఆపేందుకు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ ఘటనను కొందరు స్థానికులు రికార్డ్ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 429 కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.