Stock markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) ఈ వారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కొనసాగుతున్నప్పటికీ.. మన సూచీలు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. నూతన హెచ్1బీ (H1B) వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు రూ.88 లక్షలు) ను ఐటీ కంపెనీలు చెల్లించాలని అమెరికా ప్రభుత్వం (US govt) ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో.. ఐటీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.
ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో సెన్సెక్స్ 184 పాయింట్ల నష్టంతో 82,441 వద్ద.. నిఫ్టీ 31 పాయింట్లు క్షీణించి 25,295 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా కాస్తపడిపోయి 88.20కి చేరింది. ఇక నిఫ్టీ సూచీలో హీరో మోటోకార్ప్ లిమిటెడ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
టెక్ మహీంద్రా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, లార్సెన్ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా షేర్లు ఆరు శాతం పడిపోగా.. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు కూడా అదే బాటలో ఉన్నాయి. హెచ్1బీ వీసా కొత్త నిబంధన భారతదేశపు ఐటీ రంగాన్ని కలవరపెడుతున్నది.