లక్నో: ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో ఒక మెట్ల బావిని (Stepwell) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం గుర్తించింది. సంభాల్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా ఆదివారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. 400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో150 ఏళ్ల నాటి ‘బావోలి’ని కనుగొన్నట్లు చెప్పారు. ఈ మెట్ల బావి చుట్టూ నాలుగు గదులతో కూడిన పాలరాతి నిర్మాణాలు, కొన్ని అంతస్తులు ఉన్నాయని వివరించారు. ‘ఈ అహ్-బావోలి తలాబ్ను బిలారి రాజు తాత కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది. రెండు, మూడు అంతస్తులు పాలరాతితో, పై అంతస్తులు ఇటుకలతో నిర్మించారు. తవ్వకం చుట్టూ నాలుగు గదులు ఉన్నాయి’ అని మీడియాతో అన్నారు.
కాగా, శనివారం స్థానికంగా సమావేశం నిర్వహించిన తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో అక్కడ తవ్వకాలు ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా తెలిపారు. మెట్ల బావిని గుర్తించిన నిర్మాణం పూర్తిగా మట్టితో కప్పి ఉందని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది మట్టిని తొలగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం 210 చదరపు మీటర్లు మాత్రమే బయట పడిందని తెలిపారు. మిగిలిన ప్రాంతం ఆక్రమణలో ఉందన్నారు. ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.