పాక్‌తో కాల్పుల విరమణ తర్వాత మోదీ ప్రభుత్వ దౌత్య వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే చైనా, బంగ్లాదేశ్ చర్యలు కేంద్ర ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లోకి నెడుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతుండగా, తాజాగా ఈ జాబితాలోకి బంగ్లాదేశ్ వచ్చి చేరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నది. మూడు దేశాలు కలిసి భారత్ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పూర్తిస్థాయిలో చల్లబడకముందే చైనా మరోసారి కవ్వింపులకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల పేర్లను మార్చినట్టు ప్రకటించింది. ఈ పరిణామాలను తేలిగ్గా తీసుకోవద్దని, మోదీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వంటివని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
న్యూఢిలీ: భారత్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. పాక్, చైనా, బంగ్లాదేశ్ కలిసి జట్టుగా ఏర్పడి మన దేశాన్ని ఇబ్బంది పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే చైనా, పాకిస్థాన్ కలిసి కశ్మీర్లో ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వాటి దృష్టి ఇప్పుడు ఈశాన్య రాష్ర్టాల మీద పడినట్టు చెప్తున్నారు. ఇందుకు బంగ్లాదేశ్‌ను పావుగా వాడుకుంటున్నారని పేర్కొంటున్నారు.
ఇందుకు తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, ఏడు ఈశాన్య రాష్ర్టాలకు (సెవన్ సిస్టర్స్) కలిపి ఒక సమీకృత ఆర్థిక ప్రణాళిక ఉండాలని వ్యాఖ్యానించారు. జల విద్యుత్తు, వైద్యం, రవాణా సదుపాయాల్లో కలిసి పనిచేయాలన్నారు. అయితే.. భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, భారత దేశం పేరెత్తకుండా కేవలం ఈశాన్య రాష్ర్టాలను మాత్రమే ప్రస్తావించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. యూనస్ గతంలో చైనా పర్యటనలో ఉన్నప్పుడు సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈశాన్య భారతదేశంలోని సెవన్ సిస్టర్స్ భూ పరివేష్టిత రాష్ర్టాలని (ల్యాండ్ లాక్డ్), వాటికి సముద్రంతో ఎలాంటి అనుసంధానం లేదన్నారు. కాబట్టి సముద్రానికి బంగ్లాదేశ్ మాత్రమే ఏకైక కాపలాదారుగా పేర్కొన్నారు. తాము చైనాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఏడు రాష్ర్టాలను భూ పరివేష్టిత రాష్ర్టాలని నొక్కి చెప్పడం, వాటికి సమీపంలో ఉన్న ఏకైక సముద్ర తీరం తమదేనని చైనాలో చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని అప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి.
ఆ ప్రకటనను, తాజాగా చేసిన ప్రకటనను కలిపి చూస్తే.. భారత్‌కు వ్యతిరేకంగా పాక్, చైనా, బంగ్లాదేశ్ కలిపి ఒక కూటమిగా ఏర్పడుతున్నట్టు కనిపిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బంగ్లాదేశ్ ఇప్పటికే రాజకీయ అస్థిరత, మత విద్వేషం, అంతర్గత పోరుతో రగిలిపోతున్నది. ఆర్థికంగా దిగజారిపోయింది. ఈ పరిస్థితిని చైనా, పాక్ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయని చెప్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ సైన్యాధ్యక్షుడిని తొలగించేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన మతగురువు మౌలానా అబ్దుల్ ఖుద్దూస్ ఫారుఖీ తాజాగా మన దేశంపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాపై ఆత్మాహుతి దాడులు చేస్తానని ప్రకటించారు. తన యూట్యూబ్ చానల్లో ఈ నెల 8న విడుదల చేసిన వీడియోలో ‘కోల్‌కతాను స్వాధీనం చేసుకోవాలని బంగ్లాదేశ్ సైన్యం నన్ను ఆదేశిస్తే నేను పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తా. 70 ఫైటర్ జెట్లు కాదు కనీసం ఏడు ఫైటర్ జెట్లను కూడా వాడను.
నేను సూసైడ్ బాంబర్లను పంపి కోల్‌కతాను స్వాధీనం చేసుకుంటా’ అని వ్యాఖ్యానించారు. ‘ముందు చావు.. తర్వాత చంపు’ అనే తాలిబాన్ తరహా విధానాన్ని తాను ఉపయోగిస్తానన్నారు. ఇప్పటికే బంగ్లాలోని ఇస్లామిస్ట్ గ్రూప్‌లకు పాక్ ఐఎస్ఐ నిధులు అందిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే ఈ మధ్య భారత్‌తో సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు పెరుగుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో తరుచూ అల్లర్లు జరుగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తాజాగా ఫారుఖీ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయని చెప్తున్నారు. పాక్ తరహాలో బంగ్లాదేశ్‌లోనూ తీవ్రవాద సంస్థలను తయారుచేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.