Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) గురువారం స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు, మిశ్రమ రంగాల ధోరణుల మధ్య నిలకడగా స్థిరపడ్డాయి. ఫ్రంట్‌లైన్ సూచీలు బలహీనంగా ఉన్నప్పటికీ.. బ్రాడర్ మార్కెట్లు రాణించడం, ఆటో షేర్లలో కొనుగోళ్ల ఆసక్తి కనిపించడం ఈ రోజు ట్రేడింగ్‌లో ప్రత్యేకతగా నిలిచింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 114 పాయింట్లు నష్టపోయి 77,844.52 వద్ద స్థిరపడగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) కేవలం 4.30 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,326.65 వద్ద ముగిసింది.
ఇవాళ్టి ట్రేడింగ్‌లో సూచీలు నిస్తేజంగా కనిపించినా.. మార్కెట్ మొత్తం సెంటిమెంట్ సానుకూలంగానే ఉంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.20 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం మేర లాభపడ్డాయి. ఇది బ్రాడర్ మార్కెట్లలో కొనుగోళ్ల ఆసక్తి బలంగా ఉందని సూచిస్తోంది. రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ అత్యధికంగా లాభపడిన సెక్టార్‌గా నిలిచింది. మరోవైపు నిఫ్టీ కన్జ్యూమర్ డ్యూరబుల్, ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, టైటన్ కంపెనీ వంటి హెవీవెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది.
ఇదిలావుంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దిగ్బంధనాన్ని ముగించేందుకు యూఎస్, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 2.74 శాతం క్షీణించి బ్యారెల్‌కు 98.50 డాలర్లకు చేరింది. ఈ సానుకూల పరిణామాల మధ్య డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 94.24 వద్ద ట్రేడయింది.