న్యూఢిల్లీ, ఆగస్టు 24: మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న విద్యా రంగంలో అత్యున్నత స్థాయి పదవులు మాత్రం వారికి అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో వర్సిటీ చాన్స్‌లర్ పదవుల్లో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) పరిధిలో 1,073 వర్సిటీలు ఉండగా, ఇందులో 120 వర్సిటీలకు మహిళా వీసీలు ఉన్నారని ఏఐయూ సెక్రెటరీ జనరల్ పంకజ్ మిట్టల్ చెప్పారు.
మూడేండ్ల క్రితం దేశంలో మహిళా వీసీలు సంఖ్య 7 శాతమే ఉందన్న సంగతి గుర్తుచేశారు. వివిధ విభాగాల అధిపతులుగా, పరీక్షల కంట్రోలర్‌గా ఎక్కువగా మహిళలు ఉన్నారని, అగ్రస్థానాల్లో లింగ అసమానతలు కొనసాగుతున్నాయని ఆమె అన్నారు. ఎక్కువ మంది మహిళా వీసీలు ఉన్న రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ (84 వర్సిటీల్లో 19మంది) మొదటిస్థానంలో, తమిళనాడు (11మంది), మహారాష్ట్ర (10మంది) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి.