Suicides | న్యూఢిల్లీ, జూలై 11: దేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. ప్రపంచంలో ఎక్కువ బలవన్మరణాలు నమోదవుతున్నది భారత్లోనే అని గణాంకాలు చెప్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో దేశంలో 1.71 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2021 కంటే ఇది 4.2 శాతం, 2018 కంటే 27 శాతం ఎక్కువ. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష జనాభాకు ఆత్మహత్యల రేటు 12.4గా నమోదయ్యింది.
ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రజారోగ్య సంక్షోభంగా పేర్కొంటున్నారు. సుప్రీంకోర్టు సైతం ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఆత్మహత్యల నివారణకు తీసుకునే చర్యలపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.
దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యలకు మానసిక సమస్యలే ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. పని, ఆర్థిక అంశాలు, ఆరోగ్యం, కుటుంబ సంబంధాలు వంటి సమస్యల కారణంగా మొదలయ్యే ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనం చేస్తున్నదని అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఒత్తిడి మొదలై ఆందోళన, నిరాశగా మారుతుందని, ఇవి ఆత్మహత్యలకు కారణమవుతాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి అండ్ బిహేవియరల్ సైన్స్ వైస్ చైర్పర్సన్ రాజీవ్ మెహతా తెలిపారు.
ఇప్పుడు దేశ ప్రజారోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఆత్మహత్యలే.యువత మరణాలకు ప్రధాన కారణం ఇదే. తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొనే పేదలే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒంటరితనం కూడా ప్రధాన కారణమే.
– శ్యామ్ భట్, చైర్పర్సన్, లీవ్లవ్లాఫ్