ఇంఫాల్: ప్రభుత్వ బస్సుపై రాష్ట్రం పేరు కనిపించకుండా స్టిక్కర్ అంటించి మూసివేశారు. దీనిపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. (Manipur) ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. జాతుల ఘర్షణలతో అల్లాడిన మణిపూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఉఖ్రుల్ జిల్లాలో రాష్ట్ర స్థాయి శిరుయ్ లిల్లీ ఫెస్టివల్ మే 20న ప్రారంభమైంది. ఇందులో పాల్గొనేందుకు ఇంఫాల్‌కు చెందిన జర్నలిస్టులు ప్రభుత్వ బస్సులో అక్కడకు బయలుదేరారు. మణిపూర్ రాష్ట్ర రవాణా సంస్థ బస్సును సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఏర్పాటు చేసింది.
కాగా, ఇంఫాల్ లోయలోని మైతీలు తమ గిరిజనుల గ్రామాల గుండా వెళ్లడాన్ని కుకీ తెగలు వ్యతిరేకిస్తున్నారు. మణిపూర్ నుంచి ప్రత్యేక పరిపాలనను వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే కుకీ తెగలు ఎక్కువగా ఉన్న కొన్ని గ్రామాల మీదుగా ఆ బస్సు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాడి జరుగవచ్చని భద్రతా సిబ్బంది భావించారు. మార్గమధ్యలో ఆ బస్సు అద్దంపై ఉన్న మణిపూర్ పేరుపై స్టిక్కర్ అంటించి కనిపించకుండా చేశారు.
మరోవైపు మీడియా ప్రతినిధులు దీనిపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రం పేరు ఎందుకు కనిపించకూడదని వారు ప్రశ్నించారు. మధ్యలోనే వెనక్కి తిరిగి వెళ్లారు. ఈ సంఘటనకు నిరసనగా పెన్‌డౌన్ చేశారు. మణిపూర్‌లోని రెండు మీడియా సంస్థలు గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సంయుక్తంగా లేఖ రాశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని కోరారు. మణిపూర్ అసెంబ్లీని సస్పెండ్ చేయడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నది.