బియ్యం, పప్పు, ఉప్పు ఇలా ఏ వస్తువును కొన్నా జీఎస్టీ పేరిట పన్ను వాత. బండి కొనాలంటే లైఫ్ ట్యాక్స్. పెట్రోల్ కొట్టించాలంటే వ్యాట్, ఎక్సైజ్, సేల్స్ ట్యాక్స్. బండితో రోడ్డు మీదకు వెళ్దామంటే టోల్ ట్యాక్స్. ఉద్యోగం చేసి కాస్త ఆదాయాన్ని కండ్ల చూద్దామంటే ఇన్కమ్ ట్యాక్స్. పైసలు దాచుకొందామంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్.. సొంతింటికి ప్రాపర్టీ ట్యాక్స్, జాగా కొందామంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంప్ డ్యూటీలు.. పిల్లల చదువులు, ప్రయాణాలు, వైద్య ఖర్చులు ఇలా ప్రతిచోటా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ప్రభుత్వం పన్నుల వసూళ్లకు పాల్పడుతూనే ఉంది. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో సామాన్యుడి సంపాదన ఆశించినంతగా పెరుగక పోయినప్పటికీ.. పన్ను బాదుడు మాత్రం అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. దీంతో సామాన్యుడి బతుకు దినదిన గండం నూరేండ్ల ఆయుష్షు చందంగా మారిపోయింది. మోదీ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు రూ. 329 లక్షల కోట్లు. గడిచిన 11 ఏండ్లలో పన్ను వసూళ్లు మూడు రెట్లు పెరిగాయి. మరి, ఆ స్థాయిలో మీ సంపాదన పెరిగిందా?
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో) : పదకొండేండ్ల ఎన్డీయే సర్కారు పాలనలో సామాన్యుడి జీతంలోని సింహభాగమంతా పన్నులకే పోతున్నట్టు అర్థమవుతున్నది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మనం వినియోగించే ప్రతి వస్తువుకూ పన్ను కడుతున్నాం. ఉదయం లేవగానే పళ్లు తోముకోవడంతో పన్నుల మోత ప్రారంభం అవుతున్నది. టూత్ బ్రష్‌పై 5 శాతం, టూత్ పేస్ట్‌పై 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తున్నది. ఇక చాయ్ కావాలనుకుంటే.. ప్యాకేజ్డ్ పాలపై 5 శాతం, టీ పౌడర్‌పై 5 శాతం, చక్కెరపై 5 శాతం పన్ను కట్టాల్సిందే. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ తిందామని అనుకుంటే.. ఇడ్లీరవ్వ కోసం 5-18 శాతం వరకు, చట్నీ కోసం నూనెకు 12 శాతం పన్ను భారం మోయాల్సిందే. స్నానం చేయాలన్నా సబ్బుకు 18 శాతం, షాంపూకు 18 శాతం పన్ను కట్టాల్సిందే. ఆఫీస్‌కు వెళ్లాలన్నా పన్నులు తప్పదు.
రెడీమేడ్ వస్ర్తాలపై 12 శాతం, బూట్లపై 12-18 శాతం, బెల్ట్, వ్యాలెట్పై 18 శాతం వరకు పన్ను కడితేనే మన ఒంటిమీదికి అవి చేరుతాయి. బైక్ లేదా కారు కొనేటప్పుడు 28-48 శాతం, పెట్రోల్‌పై అన్నీ కలుపుకొని 55 శాతం పన్ను చెల్లించాల్సిందే. ఇక బండి లైఫ్ ట్యాక్స్, రోడ్డుపై టోల్ ట్యాక్స్ అదనం. ఇక, భోజనం చేయాలంటే.. బియ్యం, పప్పు దినుసులపై 5 శాతం, మసాలా దినుసులపై 5-12 శాతం పన్ను కట్టాల్సి వస్తున్నది. రొట్టెలు తినాలంటే గోధుమ పిండికి 5 శాతం చెల్లించాల్సిందే. ఎల్పీజీ సిలిండర్‌పై 5 శాతం జీఎస్టీ కడితేనే ఏ వంటైనా మన నోట్లోకి వెళ్తున్నది. చివరికి రాత్రికి పడుకొనే పరుపులపైనా 18 శాతం, బెడ్షీట్లపై 5-18 శాతం పన్ను కట్టాల్సి వస్తున్నది. చల్లని ఏసీ గాలి కావాలంటే 28 శాతం, ఫ్యాన్/కూలర్‌తో సరిపెట్టుకోవాలన్నా 18 శాతం పన్ను కట్టాల్సిందే. ఉల్లాసం కోసం సినిమాకు వెళ్దామన్నా, టూర్‌కు ప్లాన్ చేసినా పన్నుల వాత తప్పదు. ఇలా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకు, ఒంటిపైకి చేరే ప్రతి అలంకరణకు, చివరికి రోగమొస్తే చికిత్సకు, మందులకు, అత్యవసర సమాయాల్లో ఆదుకునే ఇన్సూరెన్స్లకు.. ఇలా జీవితంలో మనం వాడే ప్రతీ వస్తువు, సర్వీసుకూ ప్రభుత్వం పన్నులు పిండుకుంటున్నది.
2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే, 2025నాటికి అది రూ. 50 లక్షల కోట్లు దాటింది. అంటే గడిచిన 11 ఏండ్లలో పేద, మధ్యతరగతి ప్రజలపై ఎన్డీయే ప్రభుత్వం మూడింతల పన్నుపోటు పొడిచిందన్న మాట. 2014లో ఒక్కొక్కరి నెత్తిన సగటు పన్ను రూ. 12 వేలుగా ఉండగా.. 2025నాటికి అది రూ. 34 వేలకు చేరింది. అలా 11 ఏండ్లలో మొత్తంగా సగటున ఒక్కొక్కరి నెత్తిన పన్నుభారం రూ. 2.25 లక్షలను కేంద్రం మోపింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో జీఎస్టీదే అగ్రతాంబూలం. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 8 ఏండ్లలో మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. దేశంలో జీఎస్టీ 2017 జూలై ఒకటి నుంచి అమలులోకి వచ్చింది. దేశంలోని అనేక పరోక్ష పన్నులను ఏకీకృతం చేసి ప్రధాన పన్నుగా జీఎస్టీని ప్రవేశపెట్టారు. అన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏటా జీఎస్టీ వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. 2017-18లో రూ.7.41 లక్షల కోట్లుగా ఉండగా 2024-25లో రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
పన్నుల పేరిట సామాన్యులను బాదుతున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచిందా? అంటే అదీ లేదు. 2014లో దేశంలో ఒక్కో చిరుద్యోగి సగటు ఆదాయం నెలకు రూ. 7 వేలుగా ఉంటే, ప్రస్తుతం రూ. 14 వేలు కూడా దాటట్లేదు. తలసరి ఆదాయంలోనూ దాదాపుగా ఇదే సరళి కనిపిస్తున్నది. ఇక, ప్రభుత్వ పన్ను పోటుతో దేశంలోని కుటుంబాల నికర పొదుపు నిల్వల మొత్తం 47 ఏండ్ల కనిష్ఠానికి పడిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక కుండబద్దలు కొట్టింది. దేశ జీడీపీలో కుటుంబాల పొదుపు విలువ 5 శాతానికి పరిమితమవ్వడం కలవరపెడుతున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇక, దేశంలోని ఒక్కో పౌరుడి నెత్తిపై రూ. 4.8 లక్షల అప్పు ఉన్నదని ‘ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్-2025’ పేరిట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో తేలింది. గడిచిన రెండేండ్ల వ్యవధిలోనే ఈ అప్పు రూ. 90 వేల మేర పెరిగినట్టు సదరు నివేదిక వెల్లడించింది.
ఒకవైపు పన్నులతో ఖజానాను నింపుకొంటున్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.. ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించి వారి ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైనట్టు నివేదికలను బట్టి అర్థమవుతున్నది. దీని కారణంగానే ప్రజల సంపాదన అంతకంతకూ పడిపోతున్నది. దేశంలో నిరుద్యోగిత రేటు మోదీపాలనలో కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. దేశంలో డిగ్రీ పూర్తైన 42 శాతం మందికి ఉద్యోగాలు లేవని అజీమ్ప్రేమ్జీ యూనివర్సిటీ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. ఏటా రెండు కోట్ల చొప్పున ఉద్యోగాల భర్తీ చేపడుతామని 2014లో మోదీ ఇచ్చిన మాట ప్రకారం.. గడిచిన 11 ఏండ్లలో 22 కోట్ల ఉద్యోగ ఖాళీలను నింపాలి. అయితే, 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి.
ఆర్థిక అసమానతలకు దేశంలో ఉన్న పన్నులు ప్రధాన కారణమవుతున్నాయి. పేదలకు కొన్ని రకాలుగా సబ్సిడీలు అందుతున్నా.. కడుతున్న ట్యాక్స్‌లకు సమానంగా సేవలు అందడం లేదు. పదేండ్లలో రూ.16.50 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. మరి పేదవారికి ఒక్క రూపాయి అయినా మాఫీ చేశారా? ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్‌లు విధిస్తున్న దేశాల్లో మన దేశం ఒకటి. పన్ను ఆదాయంతో మౌలిక వసతులు అభివృద్ధి చేసి, ఉద్యోగాలు సృష్టించి ప్రజల ఆదాయం పెంచితే ఎవరికీ బాధ అనిపించదు. యూరోప్‌లో 20-25 శాతం ట్యాక్స్ విధించినా.. అక్కడి పౌరులకు ప్రభుత్వం నుంచి సరైన సేవలు అందుతాయి. మనదేశంలో విద్య, వైద్యం ఏదీ కూడా ఉచితంగా లేదు.