(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ (Congress) నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడంలేదు. అసలేం జరిగిందంటే.. ఆరు గ్యారెంటీలను ఆశగా చూపి తెలంగాణలో (Telangana) అధికారంలోకి వచ్చిన రేవంత్ (Revanth Reddy) ప్రభుత్వం.. మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 ఆర్థిక సాయం, తులం బంగారాన్ని ఎగ్గొట్టింది. అలా తెలంగాణ ఆడబిడ్డలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను మరిచిపోయారన్న ఆయన.. జూబ్లీహిల్స్‌లో గెలవడానికి అదే కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ. 5 వేలు పంచుతున్నారని ఆరోపించారు. హామీలను తుంగలో తొక్కిన అలాంటి పార్టీ నుంచి ఆ డబ్బును తీసుకొన్నప్పటికీ.. ఓటు మాత్రం వేయవద్దని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిపై మండిపడ్డ కాంగ్రెస్ సీనియర్లు.. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతమని, ఈసీకి ఫిర్యాదు చేస్తామంటూ ఊగిపోయారు. సీన్ కట్ చేస్తే.. కేటీఆర్ ఏ మాటనైతే అన్నారో.. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ కూడా అవే మాటలను అన్నారు. అంతేకాదు.. ఓట్ల కోసం ‘హింసించే భర్త’ అంటూ ఓ దిగజారుడు పోలికను కూడా తెరమీదకు తీసుకొచ్చారు.
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల పాల్గొని మాట్లాడిన ప్రియాంకా గాంధీ.. ఎన్నికల ముందు బీజేపీ రూ.10 వేలు పంచుతున్నదని ఆరోపించారు. ఆ డబ్బును తీసుకొని ఓటు మాత్రం ఇండియా కూటమికి వెయ్యాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా.. రోజూ భార్యను చితకబాదుతూ హింసించే భర్త.. ఒక్కరోజు ప్రేమగా చూసుకొంటే లాభం ఏంటని? ‘హింసించే భర్త’ పేరిట తనదైన శైలిలో ఓ ఉదాహరణను వినిపించారు. ప్రియాంక వ్యాఖ్యలపై అక్కడున్న వారంతా ఘొల్లున నవ్వారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. అవే మాటలను వల్లె వేసిన ప్రియాంక వ్యాఖ్యలపై మాత్రం స్పందించడం లేదు. కాంగ్రెస్ నేతల ఈ రెండు నాల్కల ధోరణిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించే కేటీఆర్ ప్రస్తావించారని, అంతకు మించి ఆయన వ్యాఖ్యల్లో తప్పేమి ఉన్నదని హస్తం పార్టీ నేతలను నిలదీస్తున్నారు. హామీల అమలును మరిచిన కాంగ్రెస్‌కు రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని మండిపడుతున్నారు.