MSP | న్యూఢిల్లీ, జూలై 13: దేశంలో 94 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు వర్తించడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక పరిశోధన బృందం నివేదిక పేర్కొన్నది. కనీస మద్దతు ధర వర్తించని పంటలకు మద్దతుగా ప్రత్యామ్నాయ విధానం అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించింది. కేవలం వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే.. 17 శాతం ఉత్పత్తులకే ఎమ్మెస్పీ వర్తిస్తున్నదని, మిగతా 83 శాతం ఉత్పత్తులకు ప్రభుత్వం సహకారం అందించాలని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న కనీస మద్దతు ధరల విధానంలో అనేక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నది.
ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేవలం వరి, గోధుమ, పప్పుధాన్యాలు వంటి ఆరేడు పంట దిగుబడులను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నది. మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తిలో ప్రభుత్వం కొనుగోలు చేసేది కేవలం 6 శాతం మాత్రమేనని తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.56.1 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులకు గానూ ప్రభుత్వం రూ.3.4 లక్షల కోట్ల విలువైన దిగుబడులను మాత్రమే కొనుగోలు చేసిందని పేర్కొన్నది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 71 శాతం వాటా కలిగి ఉన్న కూరగాయలు, పండ్లు, మత్య్స సంపద, లైవ్‌స్టాక్, అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వర్తించడం లేదని పేర్కొన్నది.
పంట దిగుబడులను ప్రైవేటు వ్యక్తులు సైతం ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు లేదా అంతకంటే ఎక్కువకే కొనుగోలు చేసేలా కచ్చితంగా నిబంధన విధించాలని ఎస్బీఐ బృందం సూచించింది. ఒకవేళ ఎమ్మెస్పీ కంటే తక్కువ ధరకు పంటను విక్రయించినప్పుడు నష్టపోయే మొత్తాన్ని రైతులకు నేరుగా ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే విధానాన్ని ఈ నివేదిక సిఫారసు చేసింది.