పనాజీ, మే 3: గోవాలో ఘోర విషాద ఘటన సంభవించింది. షిర్గావ్ గ్రామంలోని శ్రీ లైరాయి దేవి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా మరో 80 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆలయంలో ఏటా జరిగే జాతర సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగింది.
జాతరలో పాల్గొనేందుకు గోవా చుట్టు పక్కల రాష్ర్టాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్నారు. భారీ సంఖ్యలో భక్తుల రాక, రద్దీని నియంత్రించేందుకు తగిన బందోబస్తు చేయకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక వార్తలు తెలియచేశాయి.