Srirama Navavmi | శ్రీరామనవమి పండుగ హిందువులకే పెద్ద పండుగ. కోదండ రాముడు-సీతమ్మ వివాహం జరిగింది ఈ రోజునే శ్రీరామనవమిని యావత్ దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ సీతారాముల కల్యాణ వేడుకలను నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. శ్రీ రామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శ్రీరామ ఆలయాల గురించి తెలుసుకుందాం రండి..!
మర్యాద పురుషుడు శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య. ఈ పురాతన నగరం సరయూ నది ఒడ్డున ఉన్నది. హిందువులకు ప్రముఖ ఏడు పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఎన్నో దశాబ్దాల తర్వాత హిందువుల కల నెరవేరింది. జన్మస్థలంలో రామయ్య ఆలయం రూపుదిద్దుకున్నది. గతేడాది జనవరిలో గర్భాలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి రోజు సూర్యతిలకం (సూర్య కిరణాలు) బాల రాముడి లలాటం(నుదిటి)పై ప్రసరించేలా చర్యలు తీసుకున్నారు. సముద్రగుప్తుడు, విక్రమాదిత్య కాలం 1076 – 1126 CEకి ముందు నుంచే అయోధ్యలో రామాలయం ఉన్నది. అప్పుడే రామ్ లాల్ల అని 5-6 అంగుళాల బాల రాముడి మూర్తి విగ్రహం ఉండేది. కాల క్రమేణా గుడి ఆక్రమణలు జరిగినా, తర్వాతి కాలంలో అక్కడే అయోధ్యలో తవ్వకాలు జరిపితే అదే బాల రాముడి మూర్తి బయటపడింది. మళ్లీ అదే చోట రాముల వారి కోసం ఆలయం పునః నిర్మించి.. బాల రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి బాల రాముడిని దర్శించుకుంటున్నారు.
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌లోని ఓర్చాలో ఉన్నది. బెత్వా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైంది. రామ్ రాజా ఆలయంలో ఇతర ఆలయాల తరహాలో కాకుండా రాజ ప్రసాదంలా కనిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకుంది. ఇక్కడ శ్రీరాముడు మహారాజులా దర్శనమిస్తాడు. ఓర్చా రాణి శ్రీరాముడికి భక్తురాలు. ఇక్కడ రాముడిని ఓ మహారాజుగా భావించి పూజలు చేస్తారు. తన నిరంతరమైన భక్తితో పూజ్యమైన దేవుడిని బాలుడి రూపంలో తీసుకురావాలనే కోరికతో ఓర్చా రాణి ఒక సారి అయోధ్యకి వెళ్లింది. రాముడు ఆమెతో ఓర్చా రావడానికి అంగీకరించాడు. అయితే, ఆమె రాముడికి ఒక షరతు పెట్టిందట. ఇక్కడ నుంచి మరొక ఆలయానికి వెళ్లకూడదనే షరతుతో రాముడిని తీసుకెళ్లి ఆలయం నిర్మించింది. రాణి రాజభవనం రామ రాజా ఆలయంగా మారింది. ఇక్కడ రాముడిని దేవుడిగానే కాకుండా రాజుగా పూజిస్తారు. రాముడి కుడి చేతిలో కత్తి, ఎడమచేతిలో డాలుతో పద్మాసనం వేసుకున్న భంగిమలో కనిపిస్తాడు. రాముడి ఎడమవైపున సీతాదేవి కుడివైపు లక్ష్మణుడు, పాదాలదగ్గర హనుమంతుడు దర్శనమిస్తారు. ఇక్కడ రాజ్యమేలే రాముడి ఎడమకాలి బొటనవేలు దర్శనం అయితే చాలని.. మనసులో ఏ కోరిక కోరుకున్న తప్పనిసరిగా నెరవేరుతుందనేది అక్కడి భక్తుల విశ్వాసం. మహారాజులకు ప్రతీ రోజు ఇచ్చే గార్డ్ ఆఫ్ హానర్ సైతం ఇక్కడ నిర్వహిస్తారు.
భారతదేశంలోనే ఉన్న ప్రముఖ రామ మందిరాల్లో భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం కొత్తగూడెం జిల్లాలో ఉన్నది. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని కంచర్ల గోపన్న అనే భక్తుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. ఓ రోజు రామయ్య ఆయన కలలోకి వచ్చి భద్రాచలం కొండమీద గుడి కట్టించమని అడిగాడట. గోపన్న ఎప్పుడూ రామకీర్తనలు పాడుతూ రామదాసుగా ప్రసిద్దికెక్కాడు. ఈ ఆలయానికి మరో పేరున్నది. అదే శ్రీరామ దివ్యక్షేత్రం. పరమ పవిత్రమైన గౌతమి నది తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభువుగా కొలువైన ప్రాంతం భద్రాద్రి. రామాయణంతో దగ్గర సంబంధం ఉన్న రెండు ప్రదేశాలు భద్రాచలం, విజయనగరంగా చెప్తారు. రాముడు, సీత, లక్ష్మణులు భద్రాచలం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో బస చేసినట్లు చెబుతారు. శ్రీరాముడు సీతను రక్షించేందుకు శ్రీలంకకి వెళ్లే మార్గంలో గోదావరి నదిని దాటాడని ఈ ప్రదేశం భద్రాచలం ఆలయం నదికి ఉత్తర ఒడ్డున ఉందని చెబుతుంటారు. భక్తుడైన భద్రుడు కొండగా మారగా.. మేరువు మేనకల తనయుడైన భద్రుడు శ్రీరాముడికి పరమ భక్తుడు. అతనికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా ఇక్కడ వెలిసినట్లుగా స్థలపురాణం.
తమిళనాడు కుంభకోణంలో రామస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల కిందట రాజు రఘునాథ నాయకర్ నిర్మించారు. తంజావూరు రాజ్యాన్ని క్రీస్తు శకం 1614 నుంచి 40 వరకూ పరిపాలించిన రఘునాథ నాయకర్ రాముడికి భక్తుడు. ఈ రామస్వామి దేవాలయానికి దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం విష్ణువు అవతారమైన రాముడికి అంకితం చేయబడింది. ఆ దేవాలయంలోని మూలవిరాట్టు విగ్రహాలే ఇందుకు కారణం. ఈ ఆలయంలో రాముడు, సీతాదేవి వివాహ భంగిమలో గర్భగుడిలో కొలువు దీరి ఉంటారు. ఈ ఆలయంలో విగ్రహాలు సాలగ్రామ శిలతో తీర్చిదిద్దారు. ఒక్కొక్క విగ్రహం ఎత్తు 8 అడుగులపైనే ఉంటాయి. ఆలయంలోని మండపంలో 62 స్తంభాలు ఉంటాయి. ఈ స్తంభాలపై ఉన్న శిల్ప సౌదర్యం భారతీయ శిల్పకళకు అద్దం పడుతుంది.
ఈ కాలరామ్ మందిర్ మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పంచవటి ప్రాంతంలో ఉన్నది. శ్రీరాముడితో ముడిపడిన అంశాలు, గుర్తులు దర్శనీయ ప్రాంతాలు అనేక ఉన్నాయి. ఇక్కడ రాముడు నల్లని రూపంలో దర్శనమిస్తాడు. అందుకే రాముడిని కాలారామ్‌గా పిలుస్తారు. పంచవటీలో ఉన్న ఈ ఆలయం అద్భుతంగా ఉంటుంది. శ్రీరామచంద్రుడు తన వనవాస కాలంలో నివసించిన ప్రదేశంలోనే ఈ మందిర నిర్మాణం జరిగిందని స్థానికులు పేర్కొంటారు. ఆలయంలో రాముడు, సీత, లక్షణుడు విగ్రహాలు రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి. సర్దార్ రంగారావు అనే వ్యక్తికి గోదావరి నదిలో రాముడి విగ్రహం ఉన్నట్లు కల కనిపించారని.. అంతేకాదు కలలో వచ్చినట్లుగానే అదే స్థలంలో ఆయనకు రాముడి విగ్రహం కనిపించడంతో వెంటనే అక్కడ గుడి కట్టించినట్లుగా స్థానికులు పేర్కొంటారు.
ఈ ఆలయం కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉంది. ఆలయంలో ఉన్న రాముడు త్రిప్రయారప్పన్, త్రిప్రయార్ తేవర్ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీకృష్ణుడు శ్రీరాముడి విగ్రహాన్ని పూజించేవాడని నమ్ముతారు. శ్రీకృష్ణుడి స్వర్గారోహణం అనంతరం విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. తర్వాత దీన్ని కేరళలోని చెట్టువా ప్రాంతానికి సమీపంలోని సముద్రానికి చెందిన కొందరు మత్స్యకారులు స్థాపించారు. వక్కయిల్ కైమల్ అనే స్థానిక పాలకుడు త్రిప్రయార్ వద్ద ఒక ఆలయాన్ని నిర్మించి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ఆలయంలో రామచంద్రుడు నాలుగు చేతులతో శంఖం, చక్రం, విల్లు, మాలలతో దర్శనమిస్తాడు.
ఈ ఆలయం ఒడిశా భువనేశ్వర్‌లోని ఖరావెల్ నగర్ సమీపంలో ఉంది. నగరం నడిబొడ్డున నెలకొని ఉన్నది. రామభక్తులకు అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ ఆలయం సైతం ఒకటి. ఈ ఆలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి అందమైన చిత్రాలు ఉన్నాయి. ఇది ఒక ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా నిర్మించడంతో పాటు నిర్వహిస్తున్నారు. ఆలయ సముదాయంలో హనుమంతుడు, శివుడు, దేవతా మందిరాలు సైతం ఇక్కడ ఉన్నాయి.
ఇది చిక్కమగళూరు జిల్లాలోని హిరేమగళూరులో ఉంది. కోదండరామ ఆలయానికి రాముడు అని పేరు వచ్చింది. రాముడి విల్లును కోదండ అని పిలుస్తారు. గర్భగుడి లోపల రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. అసాధారణంగా ఈ ఆలయంలో శ్రీరాముడి కుడివైపున సీత వారు దర్శనమిస్తారు. పురోషోత్తమ అనే భక్తుడు శ్రీరాముడు, సీత వివాహాన్ని చూడాలని కోరికను వ్యక్తం చేయగా.. ఆయన కోరిక నెరవేరిందని భక్తులు భావిస్తుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం.. వివాహం సమయంలో వధువు వరుడి కుడివైపున కూర్చుండడం చూడొచ్చు.
అమృత్ సర్ కి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో చోగావాన్ రోడ్డులో ఈ ఆలయం ఉంది. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి ఆశ్రయం పొందిన ప్రదేశం. సీతాదేవి లవ, కుశలకు జన్మనిచ్చిన ప్రదేశం ఇదేనని చెబుతుంటారు. ఇక్కడ సీతాదేవి స్నానం చేసే మెట్లతో కూడిన బావి సైతం ఉంటుంది. అందుకే ఇది భారత్ లోనే అత్యంత పవిత్రమైన రామ దేవాలయాల్లో ఒకటిగా నిలిచింది. ఇది సీతారాముల సంతానం లవ, కుశులకు సంబంధించింది. గర్భిణిగా వచ్చిన సీతాదేవికి వాల్మీకి మహర్షి ఆశ్రయం కల్పించిన ప్రదేశం ఇదేనని విశ్వసిస్తారు.
ఈ రఘునాథ్ ఆలయం జమ్మూ నగరంలో ఉంది. జమ్మూనగరంలో ఉన్న ఉత్తర భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాల్లో ఒకటి. మహారాజా గులాబ్ సింగ్, ఆయన కుమారుడు రణబీర్ సింగ్ 1853- 1860 కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో చాలా మంది దేవుళ్లు కనిపిస్తారు. ఉంటారు. కానీ అధిష్ఠానం మాత్రం రామయ్యదే. ఆలయ వాస్తు శిల్పం అసాధారణంగా ఉంటుంది. రఘునాథ్ ఆలయ నిర్మాణ వైభవంలో మొఘల్ రాతి కట్టడాలు కనిపిస్తాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని హరిపూర్లోనూ ప్రముఖ రామాలయం ఉన్నది. చిన్న కాశీగా ఈ క్షేత్రానికి పేరున్నది. ఇక్కడ ఒక్కచోటే 18 పురాతన దేవాలయాలు కనిపిస్తాయి. ఇక్కడే రామచంద్రుడి ఆలయం సైతం ఉన్నది. ఈ ఆలయాన్ని 900 సంవత్సరాల కిందట నిర్మించారు. అందుకే బాగా శిథిలావస్థకు చేరుకుంది. సీత, లక్ష్మణ సమేతుడై ఇక్కడ రాముడు కనిపిస్తాడు. లోపల శిల్పాలు, చిత్రపటాలు ఉంటాయి. సంసార్‌చంద్ర, ఆయన కుమారుడు హరీశ్చంద్ర ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. కాంగ్డా వంశీకులైన ఈ ఇద్దరు పాలించిన కొండరాజ్యం నందపూర్`గులేర్‌లోనే హరిపూర్ ఉంది. ఆలయం కూడా కొండ సంప్రదాయక శిల్పకళతో అద్భుతంగా నిర్మించారు.
ఈ తమిళనాడులోని మధురాంతకంలో ఉన్నది. రామాయణంతో ఈ ప్రాంతానికి సంబంధం ఉన్నట్లుగా స్థానికులు చెబుతారు. లంకలో రావణసుర సంహారం తర్వాత శ్రీరాముడు, సీత, లక్ష్మణులతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వెళ్లే సమయంలో కొద్దిసేపు మధురాంతకంలో కొద్దిసేపు ఆగారని భక్తులు విశ్వాసం. ఈ ఆలయం వైష్ణవ సంప్రదాయానికి చెందిన 108 దివ్యదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా తిరుప్పుకుళిలో విజయరాఘవ పెరుమాళ్ ఆలయం ఉంది. ఈ ఆలయం సైతం 108 దివ్యదేశాల్లో ఒకటని భక్తుల విశ్వాసం. గర్భగుడి లోపల విజయరాఘవ పెరుమాళ్ ఒడిలో జటాయువు కనిపిస్తుంది. వనవాసం సమయంలో సీతను అపహరించుకొని పోతుంటారు. ఈ సమయంలో ఇది చూసిన జటాయువు సీతామాతను కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత సీతమ్మకు సంబంధించిన వివరాలను రాముడికి చెప్పి కన్నుమూస్తాడు. జటాయువుకు రాముడు అంతిమ సంస్కారాలు చేశాడనేది భక్తుల నమ్మకం.