Murder : పొరుగు దేశం శ్రీలంక (Srilanka) లో పట్టపగలే ఘోరం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి (Politician) ని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శాంతిభద్రతలను పునరుద్ధరిస్తామని హామీ ఇస్తూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రాజకీయ నాయకుడు హత్యకు గురికావడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. వెలిగమ నగర కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష సమగి జన బలవేగయ పార్టీకి చెందిన లసంత విక్రమశేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజలతో సమావేశమయ్యారు. అదే సమయంలో లోపలికి దూసుకొచ్చిన ఓ ఆగంతకుడు రివాల్వర్‌తో ఆయనపై పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమశేఖర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దాడి సమయంలో కార్యాలయంలో ఇతరులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి హాని జరగలేదు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా వెలిగమ కౌన్సిల్‌పై ఆదిపత్యం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ పోరు నడుస్తోందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా శ్రీలంకలో హింసాత్మక ఘటనలు, వ్యవస్థీకృత నేరాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 100కి పైగా కాల్పుల ఘటనలు జరగ్గా వాటిలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యాయవాది వేషంలో వచ్చిన ఓ దుండగుడు కొలంబో కోర్టు హాలులోనే ఓ నిందితుడిని కాల్చి చంపిన ఘటన దేశంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. తాజా రాజకీయ హత్యతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి.