చెన్నై: దగ్గు మందు అంటే భయపడేలా చేసిన కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌ను (Coldrif Cough Syrup) తయారు చేస్తున్న కంపెనీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని చెన్నైలో శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ (Sresan Pharmaceuticals) ఓనర్ రంగనాథన్‌ను (Ranganathan) మధ్యప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సిరప్ కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటివరకు 20 మంది చిన్నారులు మరణించారు.
చిన్నారుల మరణాలు, అస్వస్థత నేపథ్యంలో కాంచీపూరంలో ఉన్న స్రేసన్ ఫార్మాస్యూటికల్స్‌లో ఈనెల 1, 2 తేదీల్లో మధ్యప్రదేశ్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోల్డ్రిఫ్ సిరప్ తయారీ యూనిట్లో గ్యాస్ స్టవ్‌లపైనే రసాయనాలను వేడిచేయడం, తుప్పు పట్టిన పరికరాలు, మురికి పట్టిన పైపులు, గ్లౌజులు, మాస్కులు లేకుండా సిబ్బంది పదార్థాలను మిక్స్ చేయడం వంటివి అధికారులు గమణించారు. అక్కడున్న కార్మికుల్లో దాదాపుగా అనుభవం లేనివారేనని, స్వచ్ఛత పరీక్షలు జరుపకుండానే సిరప్‌ల కోసం నీటిని ఉపయోగిస్తున్నారని తేలింది. ఎయిర్ ఫిల్టర్లు, హెచ్ఈపీఏ వ్యవస్థలు లేకపోవడం వంటివి గుర్తించారు. ఈ యూనిట్లో తయారైన ఎస్ఆర్-13 బ్యాచ్ కోల్డ్రిఫ్ సిరప్ రెండెండ్ల కాలపరిమితితో గత మే నెలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పుదుచ్చేరిలోని మార్కెట్లోకి వెళ్లాయి.
వీటిలో డైఈథలీన్ గ్లైకాల్ 48.6 శాతం ఉన్నట్లు బయోప్సీ నివేదికలు వెల్లడించాయి. ఇది అనుమతించిన పరిమితికి 500 రెట్లు అధికం. నిజానికి అది 0.1 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఇది కిడ్నీ, కాలేయం, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావంచూపుతుంది. ఈ కారణంగా చిన్నారులు మరణించినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్‌పై అన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయి. తాజాగా, కంపెనీ ఓనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.