Maharashtra : మహారాష్ట్రలో దారుణం జరిగింది. సైకో భర్త వరకట్న వేధింపులు, శారీరక దాడి, సీసీటీవీ నిఘాతో వేదనకు గురై ఒక నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన, మహారాష్ట్ర, అంబర్నాథ్ ప్రాంతం, శివాజి నగర్ పరిధిలో బుధవారం జరిగింది. మృతురాలిని 26 ఏళ్ల విశాఖ తిలేకర్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏప్రిల్ 30న విశాఖ తిలేకర్కు, డా.నితిన్ తిలేకర్తో వివాహం జరిగింది. పెళ్లైన తర్వాత నుంచి భర్తతోపాటు అత్తవారింట్లో వారు విశాఖను అదనపు వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.
శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. పెళ్లి సమయంలో తమ ఇంటికి విశాఖ తగినంత డబ్బు, నగలు తీసుకురాలేదని ఆమెను వేధించేవారు. అంతేకాదు.. ఇంట్లో, బయట సీసీటీవీ కెమెరాల్ని భర్త ఏర్పాటు చేశాడు. విశాఖ ప్రతి కదలికను గమనిస్తుండేవారు. ఆమెను తన తల్లిదండ్రులతో, చుట్టుపక్కల వారితో సరిగ్గా మాట్లాడనిచ్చేవారు కాదు. మూడు రోజుల క్రితం విశాఖ తమ ఇంటి సమీపంలో ఉండే ఒక మహిళతో మాట్లాడింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భర్త విశాఖను దారుణంగా కొట్టాడు. దీంతో విశాఖ తీవ్ర వేదనకు గురైంది. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఈ విషయాన్ని విశాఖ ఫోన్లో తన కుటుంబ సభ్యులకు చెప్పింది. భర్త, అతడి కుటుంబ సభ్యుల వేధింపుల గురించి వివరించింది.
ఆమె చెప్పింది విన్న తల్లి, కుటుంబ సభ్యులు విశాఖను అక్కడినుంచి తమ ఇంటికి తీసుకొచ్చేయాలనుకున్నారు. కానీ, ఈలోపే విశాఖ అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త నితిన్‌ను అరెస్టు చేశారు. విశాఖ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.