భోపాల్: స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. (truck rams school bus) ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. సుమారు 25 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. స్పందించిన స్థానికులు స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తెచ్చారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌ను గురువారం సందర్శించారు. బస్సులో తిరిగి వెళ్తుండగా భోపాల్ శివారులోని భూరి బైపాస్ వద్ద వేగంగా వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుక భాగం ధ్వంసమైంది.
కాగా, ప్రమాద తీవ్రతకు బస్సులోని విద్యార్థులు సీట్ల నుంచి ఎగిరిపడ్డారు. వెనుక సీట్లలో కూర్చొన్న స్టూడెంట్స్‌లో ఒకరు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే స్థానికులు స్పందించారు. విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసుకువచ్చారు. రోడ్డు పక్కన వారిని కూర్చోబెట్టి సపర్యలు చేశారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన 9 మంది విద్యార్థులను పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.