బెంగళూరు: కర్ణాటకలోని (Karnataka) కుందాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కూడిన కారు.. జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా వేగంగా దూసుకొచ్చిన లారీ దానిని వెనుక నుంచి ఢీకొట్టింది. అలాగే కొన్ని మీటర్ల దూరం ఈడ్చెకెళ్లి ఓ బోర్డుకు ఢీకొట్టింది. దీంతో కారు ముళ్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది.
కేరళకు చెందిన ఏడుగురు ఇన్నోవా కారులో కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న కొళ్లూరు దేవీ ఆలయాన్ని దర్శించుకున్నారు. తిరిగి స్వరాష్ట్రానికి వెళ్తుండగా కుందాపూర్ వద్ద జాతీయ రహదారిపై కుంభాషి ఛండిక దుర్గాపరమేశ్వరి ఆలయాన్ని వారు గమనించారు. దీంతో కొద్దిగా ముందుకు వెళ్లిన కారును డ్రైవర్.. రోడ్డుకు ఎడమవైపున, పార్కింగ్ లైట్లు వేసుకుని ఆలయ ప్రధాన గేటు వద్దకు వెనుకకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆ కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా కొద్ది దూరం అలానే లాక్కెల్లింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు, లారీలో ఉన్నవారు మొత్తం 10 మంది గాయపడ్డారు. స్థానికుల సహకారంతో పోలీసులు వారిని దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆలయ ప్రధాన గేటుకు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
Shortcut to D¢ath: Our Roads are full of such Low IQ Idiots! Reversing car on a busy highway 🤦 pic.twitter.com/6S3UIscyq5
— Mihir Jha (@MihirkJha) November 20, 2024