న్యూఢిల్లీ: లగ్జరీ కారైన బీఎమ్‌డబ్ల్యూ, టాటా పంచ్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్లోకి అది దూసుకెళ్లింది. ఈ సంఘటనలో కోటికిపైగా విలువైన ఆ కారు ముందు భాగం తుక్కుతుక్కైంది. అయితే డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. (BMW Car Hits Another Car) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఢిల్లీ గేట్ వద్ద వేగంగా వెళ్తున్న లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూ కారు మరో కారైన టాటా పంచ్‌ను ఢీకొట్టింది. దానిని వంద మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లి డివైడర్‌ను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో లగ్జరీ బీఎమ్‌డబ్ల్యూ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.
కాగా, ముగ్గురు ప్రయాణిస్తున్న తమ కారును హైస్పీడ్ స్పోర్ట్స్ కారు ఢీకొట్టినట్లు మరో కారు డ్రైవర్ రాహుల్ తెలిపాడు. ఆ తర్వాత అది బ్యాలెన్స్ కోల్పోయి డివైడర్లోకి దూసుకెళ్లిందని చెప్పాడు. ఈ సంఘటనలో తమ కారు దెబ్బతిన్నదని, అయితే తమకు ఏమీ కాలేదని వివరించాడు.
మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందు భాగం తుక్కైన బీఎమ్‌డబ్ల్యూ కారును క్రేన్ సాయంతో అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.