Karnataka | బెంగళూరు, డిసెంబర్ 14: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ విందు రాజకీయం.. బీజేపీలో తీవ్ర కలకలం రేపుతున్నది. బుధవారం రాత్రి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం బెళగావిలో ఏర్పాటుచేసిన విందులో బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ పాల్గొన్న సంగతి మీడియాకు లీక్ అయ్యింది. ఎమ్మెల్యేలు ఎస్టీ సోమేశేఖర్, శివరామ్ హెబ్బార్, ఎమ్మెల్సీ హెచ్ విశ్వనాథ్ అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విందులో పాల్గొనటంపై బీజేపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత ఆ పార్టీలో వారు కొనసాగలేకపోతన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది. లోక్సభ ఎన్నికలకు ముందు వారు కాంగ్రెస్లో చేరుతారని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తాజా వ్యవహారంపై గురువారం బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్తో బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ మంతనాలు జరపటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై వారి నుంచి వివరణ కోరుతున్నట్టు చెప్పారు. 2019లో పార్టీ ఫిరాయించిన 17 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఈ ముగ్గురు ఉన్నారు. ఆ తర్వాత ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వంలో సోమశేఖర్, హెబ్బార్లకు మంత్రి పదవులు దక్కాయి. జేడీఎస్ స్టేట్ చీఫ్గా ఉన్న విశ్వనాథ్ 2019లో పార్టీ ఫిరాయించటం సంచలనం రేపింది. బీజేపీ ఎమ్మెల్యేలతో విందు సమావేశంపై కాంగ్రెస్ నాయకుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వారితో ఎలాంటి చర్చలు జరపలేదని, కేవలం విందుకు మాత్రమే హాజరయ్యారని డీకే ప్రకటించారు. ‘వారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి రాలేదు. కేవలం విందులో పాల్గొనేందుకే వచ్చారు’ అని డీకే అన్నారు. ఇదిలా ఉండగా, పార్టీ మారుతున్నారన్న వార్తల్ని ఎమ్మెల్యే సోమశేఖర్ కొట్టివేశారు.