Karnataka | కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు రోజురోజుకు పెరుగుతున్నట్లుగా ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడేక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్గత కలహాలను ఎదుర్కొంటోందని, పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పుడు ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయారని, పార్టీలో భారీ గొడవ జరుగుతోందన్నారు. ఈ దీపావళికి కాంగ్రెస్‌లో పెద్ద ఊహించని ఘటన జరుగుతుందని ఆయన జోష్యం చెప్పారు. మేము ముందు నుంచీ చెబుతున్నామని విజయేంద్ర అన్నారు. మనకు వస్తున్న వార్తలు కాంగ్రెస్ పార్టీలో అంతా బాగాలేదని స్పష్టంగా చెబుతున్నాయన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవచ్చు.. కానీ కాంగ్రెస్ అంతర్గత యుద్ధం ఇప్పుడే మొదలవుతుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎంగా చేయాలని కోరుకుంటున్నారని.. మరికొందరు ఏసీసీఐ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కోరుకుంటున్నారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యనే కొనసాగాలని అంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువునా చీలిపోయిందని.. ఎమ్మెల్యేలను ఒప్పించేందుకు సీఎం తమ ప్రాంతాల్లో రూ.50కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రకటించారని.. అయితే, ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదన్నారు. గత కొంతకాలంగా కర్నాటక కాంగ్రెస్‌లో సీఎం పీఠం మార్పులు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.