న్యూఢిల్లీ, మే 7: యావత్ భారతావని 15 రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వా త తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూ ర్’ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను, వా టిలోని అనేక మంది ముష్కరులను తుదముట్టించింది. ఈ ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం వెనుక ప్రత్యేకమైన సంకేతం ఉన్నది. భారత సంప్రదాయం ప్రకారం వివాహితులైన హిందూ మహిళలు సిందూరం (కుంకుమ) ధరిస్తారు. గత నెల 22న దాడికి పాల్పడిన ఉగ్రవాదులు సేదతీరుతున్న పర్యాటకుల్లో, ముఖ్యంగా దంపతుల్లో పురుషులను వేరు చేసి, వారి మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసిన జంట ల్లో అప్పటికి 6 రోజుల క్రితమే పెండ్లయిన నవదంపతులు లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (నావికాదళ అధికారి), హిమాన్షి ఉన్నారు. వినయ్ మృతదేహం వద్ద హిమాన్షి రోదిస్తున్న చిత్రం యావత్తు దేశాన్ని కలచివేసింది. హిమాన్షితోపాటు ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన ఇతర మహిళల ప్రతీకారానికి చిహ్నంగా మన ప్రతిదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని నామకరణం చేశారు.
సంయమనంతో కూడిన సందేశం ఆపరేషన్ సిందూర్‌పై ప్రపంచ మీడియా
న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చెప్తున్నదానినే చాలా విదేశీ పత్రికలు రాశాయి. ఇది దాడి కాదని, ఉగ్రవాద నిర్మూలన కోసం చేపట్టిన చర్య అని తెలిపాయి. ఈ ఆపరేషన్ వల్ల భారత్-పాక్ ఘర్షణల్లో తీవ్రత పెరిగిందని ‘న్యూయార్క్ టైమ్స్’ అభిప్రాయపడింది. భారత్ సంయమనంతో కూడిన సందేశాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ ఆపరేషన్ అత్యంత కచ్చితత్వంతో జరిగినట్టు పేర్కొంది. సైనిక టార్గెట్లపై దాడులు జరగలేదని వెల్లడించింది. సీఎన్ఎన్ కవరేజ్‌లో, భారత్ ఉపయోగించిన అ త్యాధునిక ఆయుధాల గురించి వివరించింది. ముఖ్యంగా రాఫెల్ యుద్ధ విమానాలు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణుల గురించి తెలిపింది. ఇది కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే జరిగిన దాడి అని వెల్లడించింది. ‘వాషింగ్టన్ పోస్ట్’ హెడ్లైన్లో, ‘లెక్కగట్టిన బల ప్రదర్శన’ అని పేర్కొంది. బల ప్రదర్శన చేస్తూనే, పూర్తి స్థాయి యుద్ధంగా మారడాన్ని నివారించేందుకు కృషి చేస్తున్నట్లు భారత్ సంకేతాలు ఇచ్చిందని తెలిపింది. బీబీసీ రిపోర్టింగ్‌లో, ‘బహవల్పూ ర్, మురిడ్కేలలోని ఉగ్రవాద స్థావరాలే కీలక లక్ష్యాలు’ అని పేర్కొంది. తన ప్రజలను కాపాడుకునే హక్కు భారత్‌కు ఉందని తెలిపింది. ‘గార్డియన్’ హెడ్లైన్లో, ‘వ్యూహాత్మక సహనం నశిస్తున్నదనే లెక్కగట్టిన సంకేతం’ అని పేర్కొంది. ‘అల్ జజీరా’ పాకిస్థాన్‌కు సానుభూతిని చూ పించింది. ఏబీసీ న్యూస్ ముఖ్యంగా భారత సైనిక శక్తి, సామర్థ్యాలు, విస్తృత భౌగోళిక రాజకీయ పర్యవసానాలపై దృష్టి పెట్టింది.
నా కలను సోదరి తీర్చింది కర్నల్ సోఫియా సోదరి వెల్లడి
ముంబై, మే 7: సైనికాధికారి కావాలనుకున్న తన కలలు తన సోదరి ద్వారా నెరవేరాయని కర్నల్ సోఫియా ఖురేషీ కవల సోదరి షైనా సున్సారా అన్నారు. భారతీయ సైనిక కంటింజెట్కు సారథ్యం వహిస్తున్న తొలిమహిళా అధికారి సోఫియా ఖురేషి బుధవారం ఆపరేషన్ సిందూ ర్ వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించిన సం దర్భంగా ముంబైలో సినిమా నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్న షైనా తన సోదరి విజయగాథను మీడియాతో పంచుకున్నారు. తాను కూడా సోఫియాతో మాట్లాడాన ని, బాధ్యత గల ఓ అధికారిగా ఈ రోజు తెల్లవారుజాము న (బుధవారం) ఏమి జరగనున్నదో ఒక్క మాట కూడా చెప్పలేదని ఆమె తెలిపారు.
సోఫియాను చూసి గర్విస్తున్నా తల్లి హలీమా ఖురేషీ
వడోదర (గుజరాత్), మే 7: దేశం కోసం గొప్ప పని చేసినందుకు తన కుమార్తె సోఫియాను చూసి గర్విస్తున్నానని ఆమె తండ్రి తాజ్ మొహమ్మద్ ఖురేషి చెప్పారు. పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయాలన్నారు. తన తాత, తండ్రి, తాను సైన్యంలో పనిచేశామని, ఇప్పుడు తన కుమార్తె కూడా సైన్యంలోనే ఉందని తెలిపారు. సోఫియా తల్లి హలీమా ఖురేషి కూడా తన కుమార్తెను చూసి గర్వపడుతున్నానని చెప్పారు.