IAF Airshow | భారత వైమానిక దళం రైజింగ్ డే సందర్భంగా శనివారం చండీగఢ్‌లో వైమానిక ప్రదర్శన కన్నుల పండువగా సాగింది. ఈ సందర్భంగా వైమానిక దళ సిబ్బంది ఆకాశంలో చేసిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఆమె వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఎంపీ కిరణ్ ఖేర్ కూడా ఎయిర్ షోను ఎంజాయ్ చేశారు.
చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సులో చేపట్టిన ఎయిర్ షో చూసేందుకు వేలాదిగా స్థానికులు తరలివచ్చారు. రెండున్నర గంటల పాటు ఎయిర్ షో కొనసాగింది. ఈ ప్రదర్శనలో రాఫెల్, సుఖోయ్, మిగ్, ప్రచండ, మిరాజ్, చేతక్, చిరుత, చినూక్, రుద్ర వంటి 80కి పైగా విమానాలు ఆకాశంలో విన్యాసాలు చేశాయి. వైమానిక దళానికి చెందిన శిక్షణ పొందిన జవాన్లు పారాచూట్ ద్వారా వేల అడుగుల ఎత్తులో చేసిన విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
ఇవాళ ఉదయం జరిగిన కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి కొత్త యూనిట్‌ను ప్రారంభించారు. అలాగే, వైమానిక దళం కోసం సిద్ధం చేసిన యూనిఫాంను లాంచ్ చేశారు. అన్ని వాతావరణాలను తట్టుకుని నిలిచేలా ఈ యూనిఫాంను ఎయిర్‌ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సంయుక్తంగా తయారుచేశాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రైజింగ్ డే తొలిసారి ఢిల్లీ ఆవల చండీగఢ్‌లో నిర్వహించారు.