లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రెండో దశ పోలింగ్ సాగుతుండగా పాలక బీజేపీపై ఎస్పీ నేత ఘాటు విమర్శలు గుప్పించారు. ఓటర్లలో మతపరంగా చీలిక తెచ్చేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని, బీజేపీ నెగెటివ్ రాజకీయాలు పనిచేయవని ఎస్పీ నేత ఇమ్రాన్ మసూద్ అన్నారు. షరియత్‌ను దేశంలో అమలు చేయాలనుకునేవారి కలలు ఫలించవని, ప్రధాని నరేంద్ర మోదీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళతారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ నేతలు ఎంతకాలం మత రాజకీయాలను ప్రేరేపిస్తారని ఎస్పీ నేత ఇమ్రాన్ మసూద్ కాషాయ పార్టీని నిలదీశారు. ఈ ఐదేండ్లలో యోగి రాష్ట్రానికి మేలు చేసి ఉంటే మతపరమైన రాజకీయ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని ఎస్పీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ యాదవ్ ఆరోపించారు. హిందూ-ముస్లింల మధ్య చీలిక తెస్తూ ఎన్నికలకు ముందు బీజేపీ మతరాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. కాషాయ పార్టీ నేతలు దేశాన్ని పీడిస్తున్న రైతాంగ సమస్యలు, నిరుద్యోగం, ధరల మంట గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఎస్పీ యూపీ ఎన్నికల్లో గెలుపొందుతుందని తెలిసి కాషాయ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని యాదవ్ మండిపడ్డారు.
ఇక యూపీ మలి దశ పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. యూపీలో ఉదయం 11 గంటల వరకూ 23.03 పోలింగ్ శాతం నమోదైంది. సంభాల్‌లో బీజేపీ అభ్యర్ధి వాహనాన్ని ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రెండో దశలో భాగంగా యూపీలోని 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగుతున్నది. ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. పటిష్ట భద్రత మధ్య ఓటింగ్ కొనసాగుతున్నది. మరోవైపు కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం మహిళలకు విముక్తి కల్పించేందుకు త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని, మహిళలకు హక్కులు కల్పించాలని, గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రధాని త్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసినట్లు ఆయన చెప్పారు.
అయితే బాలికలకు గౌరవం ఇస్తామని..అయితే దేశం మాత్రం ఇస్లామిక్ చట్టమైన షరియత్ ప్రకారం నడవదని, రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ ముందుకు వెళ్తుందని యూపీ సీఎం యోగి అన్నారు. ఇక యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ పావులు కదుపుతుండగా, యోగి సర్కార్‌పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ సారధ్యంలోని ఎస్పీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మరోవైపు ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతుండగా..దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సన్నద్ధమవుతోంది.