న్యూఢిల్లీ: దేశద్రోహం కేసుపై ఇవాళ కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేశద్రోహం కేసులను రిజిస్టర్ చేసేందుకు ఎస్పీ ర్యాంక్ అధికారికి బాధ్యతను అప్పగించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.ఇప్పటికే దాఖలైన కేసులను హోల్డ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. భవిష్యత్తులో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్న సమయంలో ఆ కేసులో దేశద్రోహ ఆరోపణలు చేయాలా వద్దా అన్న అంశాన్ని ఎస్పీ ర్యాంక్ లేదా అంతకన్నా పైస్థాయి అధికారి చూసుకుంటారని ప్రభుత్వ లాయర్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. దేశద్రోహ చట్టాన్ని పున సమీక్షిస్తామని కేంద్రం చెప్పిన నేపథ్యంలో.. ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులను పెండింగ్‌లో పెట్టాలా లేదా అని కోర్టు కేంద్రాన్ని అడిగిన విషయం తెలిసిందే. అయితే పెండింగ్ కేసులను హోల్డ్‌లో పెట్టాల్సిన అవసరం లేదని తుషార్ మెహతా చెప్పారు.
124ఏకు బ్రేక్.. బెయిల్ తీసుకోవచ్చు
దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించవచ్చు అని సుప్రీం తెలిపింది. దేశద్రోహ చట్టాన్ని నిలిపివేయాలని సీజే ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఆ చట్టం కింద కేసులు నమోదు చేయవద్దు అని ఆయన ఆదేశించారు. ఐపీసీ 124ఏ కింద ప్రస్తుతం కేసులు ఏవీ నమోదు చేయవద్దు అని ఆయన తన తీర్పులో తెలిపారు. దేశద్రోహ చట్టాన్ని రివ్యూ చేస్తామని కేంద్రం చెప్పిందని, ఆ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు 124ఏ కింద కేసులు బుక్ చేయవద్దు అని కోర్టు తెలిపింది. దేశద్రోహ చట్టం కింద సుమారు 13వేల మంది జైలులో ఉన్నట్లు కపిల్ సిబల్ తెలిపారు.