న్యూఢిల్లీ, మే 15: దేశంలోని ప్రజలకు, రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. నాలుగు రోజులు అటూ ఇటూ కావొచ్చని పేర్కొన్నది.
ఈ ఏడాది రుతుపవనాల రాక ముందస్తు ఏమీ కాదని, సాధారణ సమయమైన జూన్ 1కి దగ్గరిగా ఉన్నదని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర బుధవారం పేర్కొన్నారు. కాగా, ఈ ఏడాది జూన్-సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలో అంచనాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలో జూన్, జూలై నెలల్లో పడే వర్షాలు వ్యవసాయ రంగానికి చాలా ముఖ్యం.