Pahalgam Attack | పహల్గామ్ ఉగ్రదాడి, ఉగ్రవాదంపై పోరాటంలో దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్ భారత్‌కు సంఘీభావం ప్రకటించారు. భారత ప్రభుత్వం, ప్రజలతో తమ దేశం నిలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట్వర్యూలో చో హ్యూన్ దక్షిణ కొరియా ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ విషయంలో తాము చాలా కఠినంగా, దృఢంగా ఉన్నామన్నారు. ఏదైనా ఉగ్రవాద దాడిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. భారత ప్రభుత్వం, భారత ప్రజలతో ఉంటామన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు 26 మంది దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
మే 7న భారత్ సిందూర్‌ను ఆపరేషన్ చేపట్టగా.. వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని.. ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారతదేశం ఖచ్చితమైన దాడులు చేసింది. పాకిస్తాన్ దుస్సహాసానికి భారతదేశం దీటుగా స్పందించింది. దాడులను తిప్పికొడుతూ వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. అంతకు ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చో హ్యూన్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సియోల్‌ను సందర్శించిన భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో చాలా మంచి సమావేశాలు జరిగాయని ఆయన గుర్తు చేసుకున్నారు. జైశంకర్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని దక్షిణ కొరియా ఖండించినందుకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా పార్లమెంటరీ ప్రతినిధి బృందం సియోల్‌కు వెళ్ళినప్పుడు, వారు చాలా మంచి సమావేశాలు జరిగాయని నేను భావిస్తున్నాను. మీరే వారిని కలవడానికి ప్రయత్నించారు.
దీన్ని తాము అభినందిస్తున్నాం’ అని తెలిపారు. శనివారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో జరిగిన సమావేశం బాగుందని చో హ్యూన్ అన్నారు. 2015 నుంచి 2017 వరకు ఢిల్లీలో రాయబారిగా తన పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశంలో గణనీయమైన మార్పులు జరిగాయని అన్నారు. గత 10 సంవత్సరాలలో మంచి మార్పులు జరిగాయని.. ఢిల్లీకి తిరిగి రావడం చాలా గొప్పగా అనిపిస్తుందని చో హ్యూన్ అన్నారు. పదేళ్ల కిందట ఈ నగరానికి వచ్చినప్పుడు, భారతదేశ సంస్కృతి షాక్ అయ్యానని.. భారతదేశంలో కొరియా రాయబారిగా పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉందన్నారు. 2015-18 వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన ఎస్ జైశంకర్‌ను కలిశానని గుర్తు చేసుకున్నారు.