Pahalgam Attack| న్యూఢిల్లీ, మే 2: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దౌత్యపరమైన ఆంక్షలు విధించడమే కాకుండా దాయాది దేశాన్ని ఆర్థికపరమైన చక్రవ్యూహంలో బంధించాలని భారత్ యోచిస్తోంది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడే దేశాలపై ఆర్థికపరమైన ఆంక్షలను విధించే లక్ష్యంతో ఏర్పడిన ఆర్థిక కార్యాచరణ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో పాకిస్థాన్‌ను తిరిగి చేర్చాలని ఒత్తిడి తీసుకురావాలని భారత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌పై రెండు రకాలుగా ఆర్థికపరమైన ప్రతీకార చర్యలు చేపట్టాలని భారత్ యోచిస్తోంది. అందులో మొదటిది పాకిస్థాన్‌ను మళ్లీ ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చించేలా లాబీ చేయడం. దేశంలోని ఉగ్రవాద గ్రూపులకు సరిహద్దుల అవతల నుంచి అందుతున్న ఆర్థిక సహాయాన్ని అడ్డుకోవాలన్న విస్తృతమైన వ్యూహంలో భాగంగా ఈ చర్య చేపట్టాలన్నది భారత్ ఆలోచన.
ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో పాక్‌ను చేర్చాలన్న డిమాండును ముందుకు తీసుకెళ్లాలంటే తీసుకోవలసిన చర్యల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పాకిస్థాన్ గతంలో 2018 జూన్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్టులో ఉంది. గతంలో ఈ లిస్టులో ఉన్న రోజుల్లో దేశంలోకి అక్రమ నిధుల ప్రవాహం తగ్గిందని భారత్ వాదిస్తోంది. ఇక రెండో చర్య పాకిస్థాన్‌కు రుణాలు అందచేస్తున్న బహుళ ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి రుణాలు ఇవ్వకుండా అడ్డుకోవడం. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తోసహా ప్రధాన ఆర్థిక సంస్థలతో బహిరంగ చర్చలు ప్రారంభించాలని భారత్ భావిస్తున్నట్లు ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి తెలిపారు.
పాకిస్థాన్‌కు అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని పునఃసమీక్షించాలని ఆయా ఆర్థిక సంస్థలను కోరాలని భారత్ భావిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమైనప్పటికీ పాకిస్థాన్‌కు అభివృద్ధి సాయం కొనసాగడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయనున్నట్లు ఆ అధికారి చెప్పారు.
ఆర్థికంగా దివాలా తీసిన పాకిస్థాన్‌కు తిరిగి పట్టాలెక్కించడానికి ఐఎంఎఫ్ 700 కోట్ల డాలర్ల(భారతీయ కరెన్సీలో రూ.59,026 కోట్లు) రుణాన్ని అందచేస్తోంది. 2024 సెప్టెంబర్‌లో విడుదలైన ఈ రుణం విడతల వారీగా పాక్ అభివృద్ధి కోసం విడుదల చేస్తోంది. పాకిస్థాన్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి 1958 నుంచి ఇప్పటివరకు 24 సార్లు ఐఎంఎఫ్ రుణం అందచేసింది. సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరాయంగా పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఈ తరహా ఆర్థిక సహాయం అందచేయడంలోని విశ్వసనీయతను, దూరదృష్టిని భారత్ ప్రశ్నించే అవకాశం ఉంది.
ఇది గాక 4,340 కోట్ల డాలర్ల(రూ.1.13 లక్షల కోట్లు) రుణాన్ని 764 పబ్లిక్‌సెక్టార్ రుణాలు, గ్రాంట్ల కింద పాకిస్థాన్‌కు అందచేయడానికి ఆసియన్ అభివృద్ధి బ్యాంకు ముందుకువచ్చింది. వీటితోపాటు 365 ప్రాజెక్టుల కోసం 4,970 కోట్ల డాలర్ల రుణాన్ని(రూ.4.19 లక్షల కోట్లు) అందచేస్తామని ప్రపంచ బ్యాంకు పాకిస్థాన్‌కు వాగ్దానం చేసింది. ఈ ఆర్థిక సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చి పాకిస్థాన్‌కు రుణాలు ఇవ్వకుండా అడ్డుకోవాలని భారత్ యోచిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు.