న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సోనియా గాంధీ(Sonia Gandhi).. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నది. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారు. ఆస్పత్రి వర్గాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని, డాక్టర్ల బృందం ఆమెను నిత్యం పర్యవేక్షిస్తున్నదని చైర్మెన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. కడుపు, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుందని, దాని కోసం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. చికిత్సలో భాగంగా ప్రస్తుతం యాంటీబయాటిక్స్ వాడుతున్నట్లు చెప్పారు. బహుశా వాతావరణం మార్పు వల్ల సోనియా గాంధీ అనారోగ్యానికి గురై ఉంటుందని కొన్ని వర్గాలు వెల్లడించాయి. అబ్జర్వేషన్ కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారమన్నారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె కండీషన్ సీరియస్గా ఏమీలేదని డాక్టర్లు చెప్పారు.