న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం స్పందించారు. సాగు చట్టాల రద్దు నిర్ణయం రైతుల విజయమని, ఇది పాలకుల అహంకారానికి ఎదురైన ఓటమని వ్యాఖ్యానించారు. న్యాయం కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన 700 రైతుల కుటుంబాల త్యాగానికి ఫలితం దక్కిందని అన్నారు. ఇవాళ సత్యం, న్యాయం, అహింస గెలిచాయని, రైతులకు వ్యతిరేకంగా పాలకులు పన్నిన కుట్ర వమ్మయిందని ఆమె చెప్పుకొచ్చారు.
వ్యవసాయం నిర్వీర్యం చేసి రైతుల జీవనోపాధిని దెబ్బతీయాలనే కుట్ర భగ్నమైందని అన్నారు. ఈ అనుభవంతో మోదీ ప్రభుత్వం ఇకనైనా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకునే గుణపాఠం నేర్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం నేపధ్యంలో శనివారం దేశవ్యాప్తంగా కిసాన్ విజయ్ దివస్ను నిర్వహించాలని నిర్ణయించింది. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తూ దేశమంతటా ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధమయ్యాయి.