కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభ్యత్వం తీసుకోవడంతో ఈ ఘట్టం ముగిసిందని పార్టీ పేర్కొంది. మొత్తం 2.6 కోట్ల మంది సభ్యులుగా చేరారు. మరో 3 కోట్ల మంది పేపర్లు నింపడం ద్వారా సభ్యులుగా చేరారు. సోనియా గాంధీ సభ్యత్వ కార్డును పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జీ కేసీ వేణుగోపాల్ ఆమెకు అందించారు. ఇక.. సోనియా ఐడీ నెంబర్ డీఎల్ 20213212. సోనియా గాంధీ కంటే ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాభవం, అధినాయకత్వాన్ని మార్చాలన్న ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ డిజిటల్ సభ్యత్వ నమోదను తీసుకొచ్చింది.
పార్టీ సభ్యత్వ నమోదు అంతా బోగస్.. అంటూ తిరుగుబాటుదారు నేతలు పదే పదే విమర్శలు చేస్తుండటంతో కాంగ్రెస్ ఈ సారి సభ్యత్వ నమోదు కోసం డిజిటల్ యాప్ను రూపొందించింది. ఈ డిజిటల్ యాప్లో నాలుగు దశలుంటాయి. అందరికీ ఇందులో యాక్సిస్ ఉండదు. ఓ స్థాయి నేతలకు మాత్రమే యాక్సిస్ ఉంటుంది. డిజిటల్ మెంబర్ షిప్ డ్రైవ్ చేపట్టడం ద్వారా అన్ని వర్గాల విమర్శలకు చెక్ పెట్టినట్లవుతుందని అగ్ర నాయకత్వం భావించింది.