న్యూఢిల్లీ, జూలై 16: 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్‌పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ప్రమేయం ఉన్నదని గుజరాత్ పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కారణాలను పరిగణలోకి తీసుకొని ఆమె బెయిల్ దరఖాస్తును తిరస్కరించాలని సెషన్స్ కోర్టును కోరారు. గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి కల్పిత సాక్ష్యాలు, తప్పుడు సమాచారం ఆరోపణలపై గుజరాత్ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు జరుపుతున్నది. ఈ కేసులో తీస్తా గత నెలలో అరెస్టయ్యారు.
ఈ క్రమంలో కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సిట్ కీలక విషయాలను వెల్లడించింది. గుజరాత్ అల్లర్ల తర్వాత రాష్ట్రంలోని బీజేపీ సర్కారును కూల్చడానికి అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకు జరిగిన కుట్రలో తీస్తా భాగమని సిట్.. సెషన్స్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మోదీతో సహా ఇతర అధికారులు, అమాయకులను ఇరికించేందుకు గానూ ఆమె చట్టవిరుద్ధమైన ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు దాంట్లో వెల్లడించింది.
ఈ కుట్రలో తీస్తాకు రూ. 30 లక్షల వరకూ ముట్టినట్టు ఆరోపించింది. అలాగే రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నేతలను ఈ కుట్రలో ఇరికించేందుకు ఢిల్లీలో అప్పట్లో అధికారంలో ఉన్న ఓ ప్రముఖ జాతీయ పార్టీ నేతలను ఆమె కలిసేవారని పేర్కొంది. అఫిడవిట్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం తీస్తా బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనున్నది. కాగా, గుజరాత్ ఎన్నికలకు ఏడాది ముందు సిట్ ఈ అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం
విపక్షాలను అపఖ్యాతి పాలుచేయడానికే..
తీస్తా ద్వారా మోదీని ఇరికించే కుట్ర వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఉన్నారని బీజేపీ ఆరోపించింది. అహ్మద్ పటేల్‌ను వెనకుండి నడిపించింది ఆమేనని మండిపడింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కేసులో తనపై వచ్చిన ఆరోపణల నుంచి బయటపడేందుకు మోదీ నడుపుతున్న వ్యూహంలో ఇది ఒక భాగమని, మచ్చ చెరపేసుకోవడంలో భాగంగా తమ నేతలపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తింది. విపక్షాలను అపఖ్యాతి పాలు చేయడానికే తన తండ్రి పేరును అకారణంగా తెరపైకి తీసుకొచ్చారని అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ ఆరోపించారు.
ఏమిటీ కేసు?
గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీ సహా 63 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల క్లీన్చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ దివంగత ఎంపీ, నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఎహ్సాన్ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఘటనపై నిత్యం వివాదం రగులుతూ ఉండేలా 2006 నుంచి ఉద్దేశపూర్వకంగా పిటిషన్లు వేస్తున్నట్టు స్పష్టమవుతున్నట్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైనవారందరిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఘాటుగా స్పందించింది. ఆ మరుసటి రోజే కుట్రలో అమాయకులను ఇరికించారంటూ తీస్తాను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.