Sonam Raghuvanshi : హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సోనమ్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది మే 11న సోనమ్‌కు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో వివాహం జరిగింది. అనంతరం మే 20న రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ కలిసి మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లారు.
అక్కడ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతోపాటు మరో ముగ్గురితో కలిసి సోనమ్.. తన భర్త రాజా రఘువంశీని హత్య చేసింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. 11 రోజులుగా కనిపించకుండాపోయిన రాజా రఘువంశీ మృతదేహం ఒక లోయలో దొరికింది. అనంతరం సోనమ్ కోసం గాలించగా, జూన్ 7న యూపీలోని గాజీపూర్‌లో కనిపించింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, తన ప్రియుడు, మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు తేలింది. దీంతో సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా సహా నిందితులను అరెస్టు చేశారు. వారికి షిల్లాంగ్ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం అక్కడి హైకోర్టును ఆశ్రయించగా.. షిల్లాంగ్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను హైకోర్టు సమర్ధించింది. దీంతో మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శుక్రవారం దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగు ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఇప్పటికే సోనమ్ రఘువంశీకి బెయిల్ లభించినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఆమె బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించింది. ఈ అంశాన్ని ట్రయల్ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ అంశంలో కౌంటర్ ఫైల్ దాఖలు చేయాల్సిందిగా సోనమ్ లాయర్లకు కోర్టు సూచించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.