రాంచీ: వృద్ధురాలైన తల్లిని ఆమె కుమారుడు ఇంట్లో ఉంచి లాక్ చేశాడు. భార్య, పిల్లలతో కలిసి కుంభమేళాకు వెళ్లాడు. (Son locks elderly mother) మూడు రోజుల తర్వాత ఆమె ఆకలికి తట్టుకోలేకపోయింది. ప్రాణాలు నిలుపుకునేందుకు ప్లాస్టిక్ తినేందుకు ప్రయత్నించింది. వృద్ధురాలి కేకలకు స్థానికులు స్పందించారు. ఆ ఇంటి లాక్ తీసి ఆమెకు ఆహారం ఇచ్చారు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫిబ్రవరి 17న అఖిలేష్ ప్రజాపతి అనే వ్యక్తి 65 ఏళ్ల తల్లి సంజు దేవిని ఇంట్లోనే ఉంచి తాళం వేశాడు. తన భార్య, పిల్లలతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాడు.
కాగా, కుమారుడు ఇంట్లో ఉంచిన అన్నం, తాగునీటితో మూడు రోజులు ఆ వృద్ధురాలు సరిపెట్టుకున్నది. ఆ తర్వాత తినేందుకు ఏమీ లేకపోవడంతో ఆకలితో అల్లాడిపోయింది. చివరకు ప్లాస్టిక్ తినేందుకు ఆమె ప్రయత్నించింది. ఆకలికి తట్టుకోలేక కేకలు వేసింది. ఆమె అరుపులు విని పొరుగువారు స్పందించారు. ఇంటి గేట్ లాక్ తీసి లోపలకు వెళ్లి చూశారు. ఆ వృద్ధురాలికి ఆహారం అందించి ఆమె ఆకలి బాధ తీర్చారు.
మరోవైపు పోలీసులతోపాటు వృద్ధురాలి కుమార్తెకు ఈ సమాచారం ఇచ్చారు. దీంతో తల్లి వద్దకు కుమార్తె చేరుకున్నది. సోదరుడు తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసే బదులు తనకు అప్పగించి కుంభమేళాకు వెళ్లి ఉంటే బాగుండేదని ఆమె అన్నది. తల్లిని తనతో తీసుకెళ్లి ఆమె బాగోగులు చూసుకుంటానని చెప్పింది.
కాగా, వృద్ధురాలి కుమారుడికి పోలీసులు ఫోన్ చేశారు. అతడి తల్లిని ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్లడంపై ప్రశ్నించారు. అనారోగ్యం కారణంగా ఆమెను తమ వెంట తీసుకొని వెళ్లలేదని అతడు తెలిపాడు. తల్లి సమ్మతితోనే తాము కుంభమేళాకు వెళ్లామని, ఆమెకు ఆహార ఏర్పాట్లు కూడా చేశామని చెప్పాడు. అయితే ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.