హైదరాబాద్, మార్చి 31 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై మీ సోషల్‌మీడియా ఖాతాలో ఏదైనా వ్యతిరేక పోస్టు పెడుతున్నారా? లేదా మీ మిత్రుడు పంపించిన పోస్టును మరెవరికైనా షేర్ చేస్తున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియా వేదికల మీద ఇకపై ఏదైనా పోస్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట్రీ నుంచి మీకు నోటీసులు రావొచ్చు. ఆన్లైన్ వేదికలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే యూజర్లను, కంటెంట్ క్రియేటర్లను, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను కూడా న్యూస్ పబ్లిషర్లుగానే ఇకపై కేంద్రం చూడబోతున్నది. అభ్యంతరకరమైన పోస్టులు పెడితే, డైరెక్టుగా యూజర్లకే నోటీసులు పంపించనున్నది. ఈ మేరకు ఐటీ నిబంధనలు, 2021లో కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ సోమవారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. దీనిపై ఏప్రిల్ 14 నాటికి అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరింది.
సోషల్‌మీడియాలో యూజర్లు ఏదైనా పోస్టు పెట్టారనుకొందాం. అది అభ్యంతరకరంగా ఉన్నదని కేంద్రం భావిస్తే, సదరు పోస్టును తొలగించాలంటూ ఆ పోస్టు ప్రచురితమైన ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌కు (మాతృసంస్థకు) ఇప్పటివరకూ కేంద్రం నోటీసులు జారీ చేసేది. అయితే, తాజా సవరణలు అమల్లోకి వస్తే, ఇప్పుడు డైరెక్టుగా ఆ పోస్టును పెట్టిన లేదా షేర్ చేసిన యూజర్లకే ఆ నోటీసులు అందుతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసే సలహాలు, సూచనలు పాటించనటువంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమకు ఇవ్వబడిన ‘చట్టాల నుంచి రక్షణ’ హోదాను కూడా కోల్పో యే ప్రమాదం ఉన్నది.
ఈ మేరకు కేంద్రం తాజా సవరణలకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. న్యూస్, కరెంట్ అఫైర్స్ విషయంలో ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నది. దేశ సార్వభౌమాధికారం, భద్రత దృష్ట్యా నకిలీ వార్తలను అరికట్టడమే లక్ష్యంగా ఈ సవరణలు సిద్ధం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు
సోషల్‌మీడియాపై నియంతృత్వం పెంచేలా ఉన్న కొత్త సవరణలను డిజిటల్ నిరంకుశత్వంగా ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) అభివర్ణించింది. వాక్‌స్వేచ్ఛపై ప్రభుత్వం నియంత్రణ అంతకంతకూ పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం చర్యలు రాజ్యాంగ విరుద్ధమైన సెన్సార్‌షిప్‌కు బాటలు వేస్తున్నాయని మండిపడింది. ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించే పౌరులు, యాక్టివిస్టులు, నేతల గొంతుకను నొక్కేయడమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ఉన్నాయని ప్రతిపక్ష నాయకులు నిప్పులు చెరుగుతున్నారు.